గతేడాది మీటూ ఉద్యమం ఉదృతంగా సాగిన సంగతి తెలిసిందే. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఘటనలను బయటపెట్టారు. ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మహిళలు దీనికి మద్దతు తెలుపుతుంటే నటి షకీలా మాత్రం మీటూ ఉద్యమానికి తాను వ్యతిరేకమని అంటున్నారు.

అసలు కాస్టింగ్ కౌచ్ ఉదంతాల్ని మీటూ ఉద్యమం వరకు తీసుకురావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి చాలా మంది బయటకి వచ్చి చెబుతున్నారని..అలా వచ్చి నలుగురితో చెప్పుకునేకంటే.. మనకి మనం హ్యాండిల్ చేసుకోవచ్చనేది తన ఫీలింగ్ అని చెప్పింది. ఘటన జరిగినప్పుడే అక్కడికక్కడే గట్టిగా రియాక్ట్ అయితే మరొకరి ముందు గోడు చెప్పుకునే అవసరం రాదు కదా అనేది తన అభిప్రాయమని తెలిపింది. 

కాస్టింగ్ కౌచ్ ఘటనలను బయటకి చెప్పడం కంటే ముందు మనం ఆ టైం లో ఎంత గట్టిగా ప్రతిఘటించామనేదే ముఖ్యమంటూ చెప్పుకొచ్చింది. తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి గతంలోనే స్పందించిన షకీలా.. అవసరాల కోసంఒకరిని సంప్రదిస్తే వారు చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుందని.. అందుకే తను అవకాశాల కోసం వెంపర్లాడలేదని అంటున్నారు.

సినిమా అవకాశాలు తగ్గినప్పుడు కూడా ఎవరినీ కలవలేదని.. అవకాశం ఇప్పించమని కనీసం ఎవరికీ ఫోన్ కూడా చేయలేదని ఎప్పటికీ అలా చేయనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం  తనకు సినిమా అవకాశాలు తగ్గడంతో నిర్మాణ రంగంలోకి మెల్లగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.