బాలీవుడ్ సీరియల్ 'సాథ్‌ నిబానా సాథియా'తో పేరు తెచ్చుకున్న నటి దేవోలీనాని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది దేవోలీనా.

తనను పోలీసులు ప్రశ్నించడానికి మాత్రమే పిలిచారని, హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు విషయంలోకి వస్తే.. ముంబైకి చెందిన రాజేశ్వర్ ఉదాని అనే వజ్రాల వ్యాపారి గత కొద్దిరోజులుగా కనిపించడం లేదని అతడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు కుళ్లిపోయిన శవం దొరికింది. పోస్ట్ మార్టంలో అది రాజేశ్వర్ మృతదేహమని తేలింది. రాజేశ్వర్ కాల్ డేటా పరిశీలించగా.. రాజకీయనాయకుడు సచిన్ పవర్ అలానే అతడి ద్వారా కొంతమంది మహిళలతో రాజేశ్వర్ కి పరిచయం ఏర్పడిందని, వారిలో దేవోలీనా కూడా ఉందని గుర్తించారు. దీంతో సచిన్ పవర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.

అలానే దేవోలీనాని కూడా అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన దేవోలీనా.. ''సచిన్ పవర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు నాకు స్నేహితుడు మాత్రమే.. పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు. ప్రశ్నించడానికి మాత్రమే పిలిచారు'' అని చెప్పుకొచ్చింది. పోలీసులు కూడా దేవోలీనా  తమతో లేదని క్లారిటీ ఇచ్చాడు.