కరోనా వైరస్‌ రాజకీయ నాయకులను, పోలీస్‌ అధికారులను, సాధారణ జనాన్నే కాదు, సినీ సెలబ్రిటీలను సైతం వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ నటి, ఎంపీ నవనీత్‌ రాణాకి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె నివాసంలోని దాదాపు పదకొండు మందికి వైరస్‌ నిర్థారణ అయ్యింది. తాజాగా నవనీత్‌కి కూడా
కరోనా బారిన పడటం గమనార్హం.  

మొదటగా నవనీత్ మామ గంగాధర్ రాణాకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం అరవై మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు. నవనీత్ ఇంటి ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖ శుభ్రం చేయించింది. అయితే.. నవనీత్ రాణా, ఆమె భర్త రవిరాణా శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారు. దీంతో మళ్లీ వీరిద్దరి శాంపిల్స్‌ తీసుకున్నారు. నవనీత్ రిపోర్ట్‌లో రిజల్ట్ పాజిటివ్‌గా తేలింది. నవనీత్ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇక 2004లో `శీను వాసంతి లక్ష్మీ` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నవనీత్‌ కౌర్‌ `జగపతి`, `రూమ్మేట్స్`, `మహారధి`, `యమదొంగ`, `టెర్రర్‌`, `నిర్ణయం`, `కాలచక్రం` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. `రణం` చిత్రంలో ప్రత్యేక పాటలో ఉర్రూతలూగించింది. అయితే నటిగా అంతగా సక్సెస్‌ కాలేకపోయింది నవనీత్‌ కౌర్‌. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి, స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా గెలుపొందారు.