నటి మీరా మిథున్‌ ఇప్పుడు జైలు కూడు తినబోతుంది. ఆమెని పుజుల్‌ జైలుకి తరించబోతున్నారు చెన్నై పోలీసులు. ఈ నెల 27 వరకు ఆమెని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్న నటి మీరా మిథున్‌ ఇప్పుడు జైలు కూడు తినబోతుంది. ఆమెని పుజుల్‌ జైలుకి తరించబోతున్నారు చెన్నై పోలీసులు. ఈ నెల 27 వరకు ఆమెని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. దళితులను సినిమాల్లోకి రానివ్వద్దని, సినిమాల నుంచి బహిష్కరించాలని అంటూ ఇటీవల మీరా మిథున్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదిక నిరసన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. దళిత సంఘాలు సైతం మండి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేరళాలో మీరా మిథున్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో అన్వేషణ సాగించిన పోలీసులు ఎట్టకేలకు కేరళాలో పట్టుకుని అరెస్ట్ చేశారు.

 ఆమెని సైదాపేట కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. మీరా మిథున్‌తోపాటు ఆమె ఫ్రెండ్‌ అభిషేక్‌ శ్యామ్‌ని కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మీరా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వీడియోలో అభిషేక్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

అరెస్ట్ అనంతరం పోలీసులు తనని వేధిస్తున్నారని, హింసిస్తున్నారని చెబుతూ మీరా ఓ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు రోజంతా తిండి కూడా పెట్టలేదని ఆమె వాపోయింది. ఈ వీడియో సైతం వైరల్‌గా మారింది. ఇక మీరా మిథున్‌పై సెక్షన్ 153, సెక్షన్‌ 153ఏఎల్‌ఏ, 505(1)(బి), 505(2)లతోపాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు.