బుల్లితెర పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీస్, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ షో మెప్పిస్తోంది. ఈ ప్రోగ్రాంకి ఇప్పటివరకు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు.

అయితే ఇకపై వారు జబర్దస్త్ స్టేజ్ పై కనిపించరు. వారి స్థానంలో నటి మీనా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ని తీసుకొచ్చారు. ఏప్రిల్ 5న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో కొత్త జడ్జీలను పరిచయం చేసేశారు. ఒకప్పటి హీరోయిన్ మీనాతో పాటు శేఖర్ మాస్టర్ లు ఇకపై ఎక్స్ ట్రా జబర్దస్త్ కి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

రోజా, నాగబాబు ఎన్నికల కారణంగా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వారు జబర్దస్త్ షోకి దూరమైనట్లు తెలుస్తోంది. అయితే వారు శాశ్వతంగా షోకి దూరంయ్యారా..? లేక కొద్దికాలమేనా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. ఇది ఇలా ఉండగా ఈ షో కోసం మీనా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం బయటకి వచ్చింది.

రోజా కంటే మీనా కాస్త ఎక్కువగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రోజా ఇప్పటివరకు ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటే మీనా మాత్రం లక్షన్నర డిమాండ్ చేసిందట. షోకి కొత్తదనం తీసుకురావడం కోసం యాజమాన్యం కూడా అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కూడా ఇదే రేంజ్ లో అందుకుంటున్నారని సమాచారం.