తాను చూసిన షోలలో అత్యంత చెత్త షో బిగ్ బాస్ అని నటి కస్తూరి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కస్తూరి ఈసారి బిగ్ బాస్ షోపై మండిపడింది. తమిళ బిగ్ బాస్ మూడవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అంతే త్వరగా బయటకి వచ్చేసింది కస్తూరి.

ఆమెకి ఇంట్లో ఉన్న కెవిన్ గ్రూప్ తో సరిపడేది కాదు. వారు కస్తూరిని పలు రకాలుగా విమర్శించేవారు. ఆ సమయంలో ఆమెకి దర్శకుడు చేరన్, మధుమితలు సపోర్ట్ గా ఉండేవారు. ఈ నేపధ్యంలో చేరన్ ఎలిమినేట్ అయ్యారు.

ఆయనకి తక్కువ ఓట్లు వచ్చాయని కమల్ హాసన్ చెప్పడంతో అతడు హౌస్ నుండి బయటకి వచ్చేశాడు. నిజానికి చేరన్ కంటే లాస్లియాకి తక్కువ ఓట్లు వచ్చాయని కానీ ఆమెని కావాలనే హౌస్ ఉంచారని టాక్.

కెవిన్, లాస్లియాల మధ్య ఎఫైర్ ఉందంటూ బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేస్తున్నాడని.. వారి మధ్య లవ్‌ సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులకు రక్తి కట్టించి టీఆర్పీని పెంచుకునేందుకే ఇలా చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లాస్లియా గురించి కానీ తన కుటుంబం గురించి కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచించడం లేదని.. వారికి అవసరమైనది టీఆర్పీ రేటింగ్ మాత్రమేనని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన నటి కస్తూరి తనను నిరాశపరిచిన అత్యంత మోసమైన షో ఇదేనని ట్వీట్ చేసింది. అయితే బిగ్‌బాస్‌ అన్న పేరు మాత్రం వాడకుండా అమ్మడు జాగ్రత్త పడింది.