Asianet News TeluguAsianet News Telugu

హేమకి రిలీఫ్‌.. హెచ్చరించి వదిలేసిన `మా` క్రమ శిక్షణ సంఘం ?

చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైన డీఆర్‌సీ మూడు రోజులలో సరైన వివరణ ఇవ్వాలని హేమను కోరింది. ఈ నేపథ్యంలో నటి హేమపై చర్యలు తీసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ అదేం జరగలేదు.

actress hema got relief from maa drc no action on her
Author
Hyderabad, First Published Aug 15, 2021, 7:47 AM IST

`మా` ఎన్నికలు మరోసారి వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. `మా` అధ్యక్షుడు నరేష్‌పై నటి హేమ చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. దీన్ని సభ్యులు, సినీ పెద్దలు సైతం ఖండించారు. `మా` ప్రతిష్టని దెబ్బతీసే విధంగా బహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని చిరుతో సహా అందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు నరేష్‌, జీవితతోపాటు చిరంజీవి క్రమ శిక్షణ సంఘం చైర్మెన్‌ కృష్ణంరాజుకి లేఖ రాశారు. శనివారం `మా` కమిటీ సభ్యులు సైతం కృష్ణంరాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. 

ఈ మేరకు క్లాస్‌ 8 బైలాస్‌ కింద హేమకి షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైన డీఆర్‌సీ మూడు రోజులలో సరైన వివరణ ఇవ్వాలని హేమను కోరింది. ఈ నేపథ్యంలో నటి హేమపై చర్యలు తీసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. క్రమశిక్షణ సంఘం(డీఆర్సీ) నుంచి హేమ్‌కి ఓ రకంగా రిలీఫ్‌ దొరికిందని చెప్పొచ్చు. ఇదే ప్రథమ తప్పిదంగా హేమని హెచ్చరిస్తూ ఆమెపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. డీఆర్‌సీ కోరినట్లుగా హేమ తన వివరణను ఇవ్వగా, ఆ వివరణకు సంతృప్తి చెందని డీఆర్‌సీ, ఇది ఆమె మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేసినట్లుగా సమాచారం.

మరోవైపు `మా` అధ్యక్షుడిగా పోటీలో ఉన్న ప్రకాష్‌ రాజ్‌ వరుస ట్వీట్లతో దుమారంరేపుతున్నారు. తాజాగా ఆయన `జెండా ఎగరేస్తాం` అని చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. `మా`ని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ పెట్టారని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే `మా` అధ్యక్షుడి కోసం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెల 22న మీటింగ్‌ ఏర్పాటు చేసి ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక మా అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌తోపాటు మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios