రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను ఇవాళ విచారణ చేస్తున్నారు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని చెప్తున్న హేమ.. పోలీసుల విచారణకు హాజరవుతారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపధ్యంలో మరో విషయం బయిటకు వచ్చింది. అదేమిటంటే... తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని సినీ నటి హేమ (Hema) బెంగళూరు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఈ రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోనట్లు తెలుస్తోంది. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేస్తారని తెలుస్తోంది.
మరోవైపు నటి హేమ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. ‘‘మనం తప్పు చేయనంతవరకూ ఎదుటివాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుళ్లం కాదు కదా! పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం ఫ్రెష్‌గా ఉంటాం. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్దాలు ఆడాలి. 99శాతం అబద్ధాలు ఆడకుండా ఉండటం మంచిది. అందుకే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను. ప్రస్తుతం నాకు ఎలాంటి షూటింగ్‌లు లేవు. మరీ అత్యవసరమైతేనే వెళ్తున్నాను. మరో మూడు నెలలు ఖాళీగా ఉంటా’ అని హేమ అన్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీపై వారం క్రితం మెరుపు దాడి చేశారు. ఈ పార్టీలో 103 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందిన టెకీలు, సినీ నటులు, మోడల్స్ ఉన్నట్లు చెప్పారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
