17 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ చార్మీ కౌర్‌. 2002లో రిలీజ్ అయిన నీ తోడు కావాలి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది ఈ భామ. చిన్న సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత తమిళ, హిందీ మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు ఎన్టీఆర్, ప్రభాస్‌, నితిన్‌ లాంటి యంగ్ హీరోలతోనూ నటించి మెప్పించింది.

అయితే కెరీర్‌లో 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో నటనను పక్కన పెట్టి ఇతర రంగాల మీద దృష్టి పెట్టింది. 2015లో నిర్మాతగా మారిన చార్మీ తొలి ప్రయత్నంగా తనే లీడ్‌ రోల్‌లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మీ సినిమాను నిర్మించింది. తరువాత పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా చేరిన చార్మీ పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఛార్మీ షాకింగ్ డెసిషన్‌ను వెల్లడించింది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఈ భామ ఇక  మీదట నటించబోనని చెప్పేసింది. జ్యోతిలక్ష్మీ సినిమా సమయంలోనే తాను రిటైర్‌మెంట్‌ ప్రకటిద్దామని భావించానని అయితే పూరి, సీ కళ్యాణ్ లు వద్దని వారించారని చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం సీరియస్‌గా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది చార్మీ. ఇక మీదట నటిగా కొనసాగబోనని చెప్పింది.