చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మణికంఠన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. నటి పిర్యాదు మేరకు నాగపట్టినం, రామనాథపురం జిల్లాలలో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు.
కోలీవుడ్ నటి చాందిని వ్యవహారంలో అన్నాడిఎంకె మాజీ మంత్రి మణికంఠన్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మణికంఠన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. నటి పిర్యాదు మేరకు నాగపట్టినం, రామనాథపురం జిల్లాలలో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. పలు తమిళ చిత్రాలలో నటించిన చాందిని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మణికంఠన్ తనను లైంగికంగా వాడుకున్నాడని కొద్దిరోజుల క్రితం చెన్నైలోని వెప్పేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో మాజీ మంత్రి మణికంఠన్ తనను ఎలా ఇబ్బందులపాలు చేశారో వివరించారు ఆమె. మలేషియా టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నన్ను 2017లో మంత్రి మణికంఠన్ కలవాలని అధికారిక సమాచారం పంపారు. టూరిజం అభివృద్ధి విషయమై కలిసిన సమయంలో ఆయన నా మొబైల్ నంబర్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి తరచుగా ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకున్న ఆయన, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికారని నటి చాందిని తెలిపారు.
చెన్నైలో ఓ అపార్ట్మెంట్ మేమిద్దరం కలిసి సహజీవనం సాగించాం. నాకు మూడు సార్లు గర్భం రాగా, తన మిత్రుడైన ఓ డాక్టర్ తో అబార్షన్ చేయించారు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయడంతో, రహస్యంగా తీసిన నా ప్రైవేట్ ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు దిగాడని చాందిని ఆరోపిస్తున్నారు.
ఈ కేసును చెన్నై పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ అదేశాల మేరకు అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పలుసెక్షన్లపై మణికంఠన్ తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న భరణి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
