ప్రముఖ బెంగాలీ టీవీ నటి జుహీ సేన్ గుప్తాను కోల్ కత్తాలో పెట్రోల్ పంప్ యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. విషయం పెద్దది కావడంతో పోలీసులు ఈ గొడవలో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జుహీ సేన్ ఆదివారం నాడు తన తల్లితండ్రులతో కలిసి కారులో బయటకి వెళ్లడానికి సిద్ధమైంది.

మార్గ మధ్యలో పెట్రోల్ కొట్టించడానికి ఓ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగారు. 1500 రూపాయల పెట్రోల్ ఫిల్ చేయమని గ్యాస్ స్టేషన్ లో ఉండే వ్యక్తికి చెప్పగా.. అతడు పొరపాటున 3000 రూపాయల వరకు పెట్రోల్ ఫిల్ చేశాడు.

దీంతో జూహీ తండ్రి ప్రశ్నించగా.. పెట్రోల్ పంప్ యాజమాన్యం తప్పు తమదేనని కానీ డబ్బు మాత్రం చెల్లించాలని చెప్పడంతో దానికి జూహీ తండ్రి ఒప్పుకోలేదు. దీంతో వారు వయసులో  పెద్దవాడని కూడా చూడకుండా జూహీ తండ్రిని వెనక్కి నెట్టారు. కారు తాళాలు కూడా తీసుకున్నారు.

దీంతో జూహీ పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ వాదనలు వినిపించారు. దీంతో పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చారు. అయితే జూహీ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ సిటీ ఎవరికీ సేఫ్ కాదంటూ పోస్ట్ పెట్టింది.