`ది కేరళ స్టోరీ` అనే సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇదొక రాజకీయ ఎజెండాతో కూడిన సినిమా అనే కామెంట్లు, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో నటి ఆదా శర్మ రియాక్ట్ అయ్యింది. వివరణ ఇచ్చింది.
గతేడాది వచ్చిన సంచలన చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`.. కాశ్మీర్ పండితులపై సాగిన హింసా కాండని ఆవిష్కరించింది. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా వస్తుంది. `ది కేరళ స్టోరీ` పేరుతో హిందీలో తెరకెక్కుతుంది. `హార్ట్ ఎటాక్` ఫేమ్ ఆదా శర్మ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీప్తో సేన్ రూపొందించారు. విపుల్ అమృత్ షా నిర్మించిన ఈ సినిమా మే 5న హిందీతోపాటు సౌత్ లాంగ్వేజెస్‌లోనూ విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ దుమారం రేపింది.
కేరళాకి చెందిన సుమారు 32వేల మంది మహిళలు ఉగ్రవాదులుగా( ముస్లీం మతంలో బలవంతంగా) మార్చబడుతున్నారనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని ట్రైలర్‌ని బట్టి అర్థమయ్యింది. గత పన్నెండేళ్లలో కేరళ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్‌కు గురయ్యారని, దాదాపు 32వేల మంది యువతులను అపహరించారని, వారు ఉగ్రవాదులుగా మారుతున్నారని, వారి చర్యలకు బలవుతున్నారని పేర్కొంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా దుమారం రేపుతుంది. వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇదొక ప్రొపగండా ఫిల్మ్ గా వర్ణిస్తున్నారు. కేరళా సీఎం పినరయి విజయన్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర సామాజిక సంస్థలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా దీనిపై నటి ఆదాశర్మ స్పందించింది. తాను ఆడియెన్స్ తో కాసేపు ముచ్చటించింది. ఇందులో తనకు వచ్చిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా ఓ వీడియోని పంచుకుంది. ఇందులో ఆదాశర్మ చెబుతూ, ఈ సినిమా ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ కచ్చితంగా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకమైనదిగా పేర్కొంది. అమ్మాయిలు మత్తు మందులకు, బ్రెయిన్ వాష్‌కి, అత్యాచారానికి గురి కావడం, మానవ అక్రమ రవాణా, బలవంతంగా గర్భం దాల్చేలా చేయడం వంటి అంశాలను చర్చిస్తుందని తెలిపింది. అంతేకాదు గర్బిని మహిళలు ప్రసవించిన తర్వాత తల్లుల నుంచి బిడ్డని వేరు చేసి, వారిని ఆత్మాహుతి బాంబర్లుగా తయారు చేస్తున్నారనే విషయాలను తెలిపే చిత్రమని వెల్లడించింది ఆదాశర్మ.
ఆమె ఇంకా చెబుతూ, ఈ సినిమాని రాజకీయ ఏజెండా, ప్రచారం కోసం తీసిన చిత్రంగా పిలిచినప్పుడు, అది కేవలం టాపిక్‌ని డైవర్ట్ చేసే ప్రక్రియ అవుతుందని, లేదంటే సమస్యని చిన్న విషయంగా చేసే చర్య అవుతుందని తెలిపింది. మా సినిమా జీవితం, మరణం గురించి ఉంటుందని, కాబట్టి ఈ సినిమాతో మేం అన్ని కులాల, మతాల, వర్గాల అమ్మాయిలకు అవగాహన కల్పించగలమని నమ్ముతున్నాం. అయినప్పటికీ కొందరు ఇదొక ఏజెండా ఫిల్మ్ గా చెబితే, మే 5న సినిమా చూస్తే వారికి నిజాలేంటో అర్థమవుతాయి. సినిమా చూశాక వారి మైండ్ సెట్ కూడా మారుతుందని చెప్పింది ఆదాశర్మ. ఆదా శర్మ వ్యాఖ్యలు సైతం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరి ఇది ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ఆదాశర్మతోపాటు సిద్ధి ఇద్రానీ, సోనియా బలానీ, యోగితా బిహానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
