నేచురల్‌ స్టార్‌ నాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.అది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అదేమిటంటే... ‘జీరో రెమ్యునరేషన్‌’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అంటే,  రూపాయి కూడా రెమ్యునరేషన్‌ లేకుండానే నటించడం ఈ ‘జీరో రెమ్యునరేషన్‌’ ఉద్దేశ్యం. అయితే ఈ ప్రతిపాదనకు సాధారణంగా ఎవరూ ఒప్పుకోరు. క్రేజ్‌ వున్నప్పుడే రెమ్యునరేషన్ లాగేసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఈ జీరో రెమ్యునేషన్ కాన్సెప్ట్ ని తన సినిమాలో వర్కవుట్ చేసామంటోంది నందితాదాస్.

వివరాల్లోకి వెళితే..నటిగా మంచి గుర్తింపును సాధించిన నందితా దాస్‌, దర్శకురాలిగానూ పలు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందులో ‘మాంటో’ చిత్రం ఒకటి. ప్రముఖ ఉర్దు రచయిత సాదత్‌ హసన్‌ మాంటో జీవిత కథ ‘మాంటో’ పేరుతో తెరకెక్కింది. సినిమాలో మాంటోగా నవాజ్‌ సిద్దిఖి నటించారు.  ఈ చిత్రంలో రిషి కపూర్‌, పరేశ్‌ రావెల్‌, జావేద్‌ అక్తర్‌, రణవీర్‌ శోరి, దివ్య దత్తా తదితర నటీనటులు కూడా ఉన్నారు. వీళ్లెవరూ పైసా కూడా పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటించడం విశేషం. నవాజ్‌ సిద్ధిఖి మాత్రం ఓ రూపాయి పారితోషికం తీసుకున్నారు. 

 ఇక రిషి కపూర్, పరేష్‌ రావల్, రణ్‌వీర్ షోరే, దివ్య దత్తా, జావేద్ అక్తర్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటించారట. వారందరూ డబ్బుకు విలువ ఇవ్వలేదని, మంచి స్క్రిప్ట్‌కు విలువ ఇచ్చారని నందితా దాస్ తెలిపారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాదు కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ఈ సినిమాను ప్రదర్శించారు.
మంచి పాత్రలు దొరికితే ఆర్టిస్టులు పారితోషికం గురించి పట్టించుకోరని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ అనీ, మంచి పాత్రల కోసం గొప్ప నటీనటులు ఆకలితో ఎదురుచూస్తున్నారనీ నందితా దాస్‌ చెప్పారు.