'ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు కన్నడ ఇండిస్టీలో పెద్ద స్టార్‌ అయ్యారు. మరో గొప్ప విషయమేమంటే కొడుకు సూపర్‌స్టార్‌ అయినా తండ్రి మాత్రం ఇంకా బస్‌ డ్రైవర్‌గానే ఉన్నారు. యష్‌ కంటే ఆయన తండ్రే పెద్ద సూపర్‌స్టార్‌ అని నాకు అనిపించింది..అంటూ రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు రాజమౌళి కన్నడ హీరో యష్ గురించి చెప్పిన మాటలు గుర్తుండే ఉండి ఉంటాయి.  దాదాపు అవే మాటలని రిపీట్ చేసాడు విశాల్. 

కన్నడంలో భారీ బడ్జెట్‌తో బంగారం గనులు, స్మగ్లింగ్‌ నేపథ్యంతో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’. ఇందులో యష్‌, శ్రీనిధి శెట్టి జోడీగా నటించారు. చిత్రం ట్రైలర్‌ ఇప్పటికే అన్ని భాషల్లోనూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేఫధ్యంలో చిత్రాన్ని తమిళంలో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్‌ విడుదల చేస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా  చెన్నైలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు. 

విశాల్‌ మాట్లాడుతూ.. యష్‌ పెద్ద స్టార్‌ అయినప్పటికీ, అతని తండ్రి ఇప్పటికీ బస్‌ డ్రైవర్‌గానే పనిచేస్తున్నారని చెబుతూ.. యష్‌ తండ్రి ఎందరికో ఆదర్శనీయులని పేర్కొన్నారు.  ఈ మాటలు విన్న వారు రాజమౌళి చెప్పిన మాటలనే రిపీట్ చేసాడన్నారు. 

అలాగే ‘తెలుగులో ‘బాహుబలి’ ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో కన్నడ స్టార్‌ హీరో యష్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ కూడా కన్నడంలో అంతటి సెన్సేషన్‌ సృష్టిస్తుంది. అందులో నాకూ చిన్న భాగస్వామ్యం ఉండడం సంతోషంగా ఉంది’ అన్నారు నటుడు విశాల్‌.  ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.