ఎగ్మూర్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు నుంచి యాక్టర్ విశాల్ కు మరో షాక్ ఎదురైంది. ఇప్పటికే నిర్మాతల మండలికి సంబందించిన కేసులతో సతమతమవుతున్న  విశాల్ కి సరికొత్తగా సేవా పన్ను చెల్లింపు విషయంలో కొత్త చిక్కు ఎదురయ్యింది. కేసును కొనసాగించాలనుకుంటే విచారణకు సిద్దంకండి లేదంటే చట్ట ప్రకారం ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సిన 4కోట్ల రూపాయలను చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అసలు వివరాల్లోకి వెళితే.. నిర్మాతగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే సంస్థను నడుపుతున్న విశాల్ పలు చిత్రాలను నిర్మించారు. అయితే కొందరికి కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు టీడీఎస్ కట్టలేదు. వీలైనంత త్వరగా 4కోట్ల టీడీఎస్ ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినప్పటికీ విశాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.   దీంతో ఐటి అధికారులు కోర్టును ఆశ్రయించగా విశాల్ కు చేదు అనుభవం ఎదురైంది. విచారణకు హాజరుకావాలని గతంలో చాలా సార్లు న్యాయస్థానం సమన్లు జారీ చేయగా విశాల్ స్పందించలేదు. 

చివరికి నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేయడంతో విశాల్ బుధవారం ఎగ్మూర్ కోర్టులో హాజరయ్యారు. దాదాపు రెండు గంటల కోర్టు విచారణలో పాల్గొన్న విశాల్ కు న్యాయస్థానం ఒక వివరణ ఇచ్చింది. 'కేసును కొనసాగించాలనుకుంటున్నారా? లేక ఆదాయపు పన్ను శాఖకు కట్టాల్సిన 4కోట్లు ఇచ్చి కేసుజేకు ముగింపు పలుకుతారా?' అని కౌంటర్ ఇచ్చింది.  వచ్చే నెల 12న కోర్టుకు సరైన వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి, విశాల్ కు తెలియజేశారు.