కన్నడ సూపర్‌ స్టార్‌, అలనాటి నటుడు విష్ణువర్థన్‌పై తెలుగు నటుడు, విలన్‌ పాత్రధారి విజయ్‌ రంగరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఏకంగా కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని షేక్‌ చేస్తున్నాయి. కన్నడ మాత్రమే కాదు, ఇతర భాషల నటులు సైతం స్పందించి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక విష్ణువర్థన్‌ అభిమానులు సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేస్తూ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

దీంతో దిగొచ్చిన విజయ్‌ రంగరాజు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. `పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశాను. కన్నడ అభిమానులు, అలాగే పునీత్‌ రాజ్‌కుమార్‌, యష్‌, సుదీప్‌ హీరోలందరి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతున్నాను. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. పొరపాటున చేసేశాను. దయజేసి నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటి తప్పు చేయను. పెద్ద మనసుతో నన్ను క్షమించండి` అని కన్నీరు పెట్టుకున్నారు. నేలపై పడి దెండం పెట్టాడు విజయ్‌రంగరాజు. 

మరి ఇంతకి విజయ్‌ రంగరాజు.. విష్ణువర్థన్‌పై ఏం కామెంట్‌ చేశాడనేది చూస్తే, ఓ ఇంటర్వ్యూలో కన్నడ సూపర్‌ స్టార్‌, లేట్‌ విష్ణువర్థన్‌ని ఓ సన్నివేశం విషయంలో ఆయన కాలర్‌ పట్టుకున్నానని, చెడామడా తిట్టేశానని తెలిపారు. అయితే ఆయన ఏక వచనంతో మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు విష్ణువర్థన్‌ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ప్రస్తుతం లేని నటుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కన్నడ ఫ్యాన్స్‌ అందరూ విజయ్‌ రంగరాజుపై ఫైర్‌ అవుతున్నారు. 

స్టార్‌ హీరోలు సుదీప్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, యష్, నటి సుమలత వంటి వారందరూ సోషల్‌ మీడియా వేదికగా.. విజయ్‌ రంగరాజుపై ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ లు పెట్టారు. దీనికితోడు వారి అభిమానులు ఏకమవ్వడంతో సోషల్‌ మీడియాలో విజయ్‌ రంగరాజు విపరీతంగా ట్రోల్‌ అయ్యారు. బూతులతో గట్టిగా ఏసుకున్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరం కలిసి మెలిసి ఉంటూ.. తోటి నటీనటులను గౌరవించుకోవడం అనేది నటుడికి ఉండాల్సిన లక్షణం. అలాంటిది.. ఒక నటుడి గురించి, అందునా భూమిపై జీవించిలేని నటుడి గురించి అటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కన్నడ పరిశ్రమ మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 

అంతేకాదు కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌లో విజయ్‌ రంగరాజుపై ఫిర్యాదు కూడా చేశారు. కన్నడ అభిమానులు, స్టార్‌ హీరోలందరూ విజయ్‌ రంగరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడంతో పాటు.. టాలీవుడ్‌లోనూ అతనిపై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలను కోరుతున్నారు. తెలుగు నటుడు, `మా` అధ్యక్షుడు నరేష్‌ సైతం విజయ్‌ రంగరాజు వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఎట్టకేలకు స్పందించి అందరికి క్షమాపణలు చెప్పారు విజయ్‌రంగరాజు. మరి దీనితోనైనా ఈ వివాదం సర్దుమనుగుతుందా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్‌ రంగరాజు కరోనాతో బాధపడుతున్నారని తెలుస్తుంది.