కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. దీనికోసం పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని.. దీని గురించి ఎన్నో ఏళ్లుగా పోరాటం జరుగుతోందని.. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనేది అందరి కోరిక అంటూ చెప్పుకొచ్చారు. 

దీనికోసం తను పోరాటం చేస్తానని.. ఈ మేరకు ఈ నెల 14,15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తానని.. దీనికి యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు వీడియోలో చెప్పుకొచ్చారు.

బెంగుళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుండి ఉపాధి కోసం చాలా మంది అక్కడకి వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన చాలా కాలంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు.

అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కూడా ఆయన మాట్లాడారు.