'పట్టదారి', 'కేరళనాటిన్ పెంగలుడన్' వంటి చిత్రాల్లో హీరోగా చేసిన నటుడు శరవణకుమార్(32) కిడ్నాప్ కి గురయ్యాడు. స్థానిక వలసరవాక్కంలో ఆయనని కిడ్నాప్ చేశారు. గురువారం రాత్రి తన కుమారుడిని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారంటూ శరవణకుమార్ తండ్రి రాజేంద్ర పాండియన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

వెంటనే వలసరవాక్కం సహాయ కమిషనర్ సంపత్, ఇన్స్పెక్టర్ సుబ్రమణియన్ అక్కడకి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. సుజిత్, దర్శన్, అరుణ్ కుమార్ లు తనను కారులో కిడ్నాప్ చేశారని.. ఆందోళన పడకండి అంటూ శరవణకుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఫోన్ కట్ అయింది.

శుక్రవారం శరవణకుమార్ ఇంటికి చేరుకున్నాడని  తెలియడంతో పోలీసులు అతడిని విచారించారు. డబ్బు కోసమే తనను కిడ్నాప్ చేశారని శరవణకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా.. 'పట్టదారి' సినిమాలో హీరోయిన్ గా నటించిన అతిథి మీనన్ ను శరవణకుమార్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ మధ్య వారిమధ్య విబేధాలు రావడంతో మూడు నెలల క్రితం ఇద్దరూ విడిపోయారు.