కక్షతో రగిలిపోయే కసాయిలా వద్దు, చంద్రబాబును వదిలేయండి: యాక్టర్ రవిబాబు

రవిబాబు .. చంద్రబాబుకి మద్దతుగా స్పందించారు. ఆయన్ని జైలు నుంచి విడిచిపెట్టాలని జగన్‌ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చరిత్రలో కక్షతో రగిలిపోయే కసాయిలా మిగిలిపోతారా? మంచి మనసు వారిలా ఉండిపోతారా? అనే తేల్చుకోవాలని తెలిపారు. 

actor ravibabu shared video to support chandrababu naidu and warn to ap cm jagan arj

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతుంది. చాలా మంది సినీ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందిస్తున్నారు. బోయపాటి శ్రీను ఏకంగా తన సినిమాలో డైలాగు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు సైతం స్పందించారు. చంద్రబాబుకి మద్దతుగా, ఆయన్ని జైలు నుంచి విడిచిపెట్టాలని జగన్‌ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చరిత్రలో కక్షతో రగిలిపోయే కసాయిలా మిగిలిపోతారా? మంచి మనసు వారిలా ఉండిపోతారా? అనే తేల్చుకోవాలని తెలిపారు. 

ఇందులో రవిబాబు మాట్లాడుతూ, `జీవితంలో ఏది శాశ్వతం కాదండి, సినిమా వాళ్ల గ్లామర్‌ గానీ, రాజకీయ నాయకుల పవర్‌గానీ, అస్సలు శాశ్వతం కాదు, అలాగే చంద్రబాబు నాయుడికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. రామారావుగారి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు. బాగా కావాల్సిన వాళ్లు. చంద్రబాబు నాయుడు ఏదైనా పనిచేశారంటే వంద యాంగిల్స్ లో చూసి, అందరిని సంప్రదించి ఎవరికి ఇబ్బంది కలుగకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆయనకు భూమ్మీద ఇవాళే లాస్ట్ రోజుని తెలిసినా, కూర్చొని నెక్ట్స్ యాభై ఏళ్లకి సోషల్‌ డెవలప్‌మెంట్‌ గురించి ప్లాన్స్ వేస్తారు. డబ్బు కోసం కక్కుర్తి పడే వ్యక్తి కాదు. అలాంటి ఆయన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. 

రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం. కానీ డెబ్బై మూడేళ్ల వయసున్న ఆయన్ని జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పై ఎత్తో అయితే మాత్రం చాలా దారుణం. అశాశ్వతమైన పవర్‌ ఉన్న వాళ్లకి నా హంబుల్‌ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ పవర్‌ని అయితే వాడి ఆయన్ని జైల్లో పెట్టారు, అదే పవర్‌ని వాడి ఆయన్ని వదిలేయండి. మీరు చిటికెస్తే అది జరిగిపోతుందని అందరికి తెలుసు. మీరు ఆయన్ని బయటుంచి ఏ ఇన్వెస్టిగేషన్‌ అయినా చేయండి, ఆయన కచ్చితంగా ఈ దేశాన్ని వదిలి పారిపోరు. ఆలోచించండి. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు. 

కక్షతో రగిలిపోయే కసాయి వాళ్లలాగనా, జాలి మనసు, మోరల్స్ ఉన్న మంచి నాయకుడిలాగనా? దయజేసి చంద్రబాబు నాయుడిని వదిలేయండి, నాలాగా ఎంతో మంది మీపై కృతజ్ఞతతో ఉంటారు` అని వేడుకున్నారు నటుడు, దర్శకుడు రవిబాబు. ఓ ఆయన తన వీడియోలో సున్నితంగా హెచ్చరిస్తూనే రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం రవిబాబు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చంద్రబాబు నాయుడు స్కిల్స్ డెవలప్‌మెంట్స్ స్కామ్‌ కి సంబంధించిన ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. బెయిల్‌ కోసం చాలా రకాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios