`ఓటు వేయడం మన హక్కు. ఓటు వేయకపోవడం నేరం. ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలి` అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన పదిగంటల సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య, కుమారుడితో కలిసి ఓటు వేశారు.  ఈ సందర్భంగా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను అరకు నుంచి వచ్చి ఓట్‌ వినియోగించుకున్నట్టు తెలిపారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ, `పోలింగ్‌ ఇంత మందకోడిగా జరగడం బాధగా ఉంది. ఓటు వేసేందుకు ఇంకా ముందుకు రాకపోవడం విచారకరం. ఓటు అనేది మన అందరి హక్కు. ప్రశ్నించే హక్కు. ఓటు వేసిన వాడే ప్రశ్నించే హక్కు ఉంటుంది. లేకపోతే సమస్యలను ప్రశ్నించే హక్కు లేదు. ఎవరి కోసమో మనం ఓటు వేయడమేంటనే ఆలోచన నుంచి బయటపడండి. ఓటు వేయడమంటే వ్యవస్థని నిలబెట్టడం, వ్యవస్థకి విలువ ఇవ్వడం. నన్ను చూసైనా నలుగురు ఓటు వేయడానికి వస్తారని ఆశిస్తున్నా. ఇంకా టైమ్‌ ఉంది. నిద్ర లేవండి.. లేచి రండి.. ఓటు వేయండి` అని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. 

నటి, యాంకర్‌ ఝాన్సీ కూడా ఓటుని వినిపియోగించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి, సురేఖ, నాగార్జున, తేజ, మంచు లక్ష్మీ, పరుచూరి బ్రదర్స్, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి వంటి వారు ఓట్‌ని వినిపించుకున్న విషయం తెలిసిందే.