తెలుగు పరిశ్రమకు చెందిన హాస్య నటుడు, మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో క్వారంటైన్లో జాయిన్ అయ్యారు. తనకు ఆరోగ్యం బాలేదని స్వయంగా పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై నుండే సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. పృథ్వీరాజ్ అనారోగ్యం వార్తతో అటు ఇండస్ట్రీ పరంగా.. ఇటు సినీ అభిమానులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ నేపధ్యంలో ఆయన తాను కోలుకుంటున్నానని,స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియచేసారు.

ఆ వీడియోలో నిన్న‌టికీ, ఈనాటికీ త‌న ఆరోగ్యం వేయి రెట్లు మెరుగుప‌డింద‌ని, త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్య‌వంతుడ్ని అవుతాన‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అలాగే వైకాపా ఎం.ఎల్.ఏ అంబ‌టి రాంబాబు త‌న‌కు చాలా మ‌నో ధైర్యాన్ని అందించార‌ని, ఆ స్ఫూర్తితో ఇంకొంచెం త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతాన‌ని న‌మ్మ‌కం ఉందని అన్నారు. 

తానో ఫైట‌ర్ అని, క‌రోనాపై పోరాడి త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాన‌ని, త్వ‌ర‌లోనే త‌న వాణీ, బాణీ మ‌రోసారి చూపిస్తాన‌ని చెప్పుకొచ్చారు. మొన్న‌టి వీడియోలో పృథ్వీరాజ్ బాగా నీర‌సంగా క‌నిపించారు. అయితే ఈసారి... ఆయ‌న‌లో కొత్త ఉత్సాహం క‌నిపించింది. త్వ‌ర‌లోనే ఆయ‌న ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు.