స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల కాలంలో చేసిన కొన్ని పాత్రలు సంతృప్తి ఇవ్వలేదంటూ గతంలో చేసిన చిత్రాలపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.
ఎఫ్3 (F3 Movie)సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ ముగిసేనాటికి రూ. 65 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఎఫ్3 సక్సెస్ మీట్ లో ప్రగతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత చిత్రాల్లో ఆమె చేసిన కొన్ని పాత్రలు సంతృప్తి ఇవ్వలేదన్నారు.
ప్రగతి (Pragathi)మాట్లాడుతూ.. ''కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదనే వెలితి నన్ను వెంటాడుతూనే ఉంది. అందమైన, యంగ్ అమ్మగా, పెద్ద విలన్ పక్కన నిలబడే పాత్రలతో చాలా సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగా కనిపించా. ఆ పాత్రలేమీ నాకు సంతృప్తి కలిగించలేదు. దానితో విసుగు చెంది ‘నేను చేయాల్సింది ఇది కాదు’ అని మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నా. మంచి పాత్రలో మళ్లీ రావాలి అనుకుంటున్న సమయంలో ‘ఎఫ్3’లో అవకాశం వచ్చింది. అందులో నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇలాంటి ఓ అవకాశం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా. నటిగా ఈ చిత్రం నాకెంతో సంతృప్తినిచ్చింది'' అని అన్నారు.
ఎఫ్2 తో పాటు ఎఫ్3లో ప్రగతి కీలక రోల్స్ దక్కించుకున్నారు. ఆమె పాత్రలకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రగతి కెరీర్ మొదలైంది మాత్రం హీరోయిన్ గా. ఆమె తమిళం, మలయాళ భాషల్లో హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేశారు. తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమె బాబీ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ మూవీలో ఆమె మహేష్ తల్లి పాత్ర చేశారు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రానికి దర్శకత్వం వహించగా... దిల్ రాజు నిర్మించారు. వెంకీ-వరుణ్ హీరోలుగా చేశారు. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక రోల్స్ చేశారు. ఎఫ్3 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.