సాహో చిత్రాన్ని దాదాపు 300 కోట్లకుపైగా ఖర్చుతో తెరకెక్కించారు. యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, యూవీక్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రాన్ని పక్కన పెట్టి కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం ఉండనుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. 

ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కించాలనుకునే దర్శకులకు ఓ ఆప్షన్ గా ప్రభాస్ మారిపోయాడు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో హృతిక్ రోషన్, సీతాదేవి పాత్రలో  దీపికా పదుకొనె నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రామాయణంలో అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్ర కోసం ప్రభాస్ ని దర్శకుడు నితీష్ సంప్రదించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

బహుభాషా చిత్రంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ప్రభాస్ ఓకే చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అందరికి తెలిసిందే.