సీనియర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. ఓ షూటింగ్ లో పాల్గొని వచ్చిన పోసాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కరోనా అని నిర్ధారణ అయినట్లు సమాచారం.
నటుడు దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళికి కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది. పూణేలో ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొని నగరానికి వచ్చిన పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ కరోనాగా నిర్ధారించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుంది. ఇప్పటికే పోసాని రెండు సార్లు కరోనా బారిన పడ్డారు.
గతంలో పోసాని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొని చికిత్స అనంతరం కోలుకున్నారు. పోసానికి కరోనా సోకిందన్న వార్త అభిమానులను ఆందోళను గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పోసాని రచయితగా పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయన పలు హిట్ చిత్రాలకు, కథ, మాటలు అందించారు. దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. చాలా కాలంగా ఆయన నటుడిగా సెటిల్ అయ్యారు.
రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయనను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ఇటీవల నంది అవార్డులపై పోసాని విమర్శలు చేశారు. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ సానుభూతిపరుడిగా ఉన్న పోసాని... సీఎం జగన్ ని ఎవరైనా విమర్శిస్తే నిప్పులు చెరుగుతుంటారు. వైఎస్ జగన్ ని సైకో అన్నందుకు బాలయ్య మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తుపాకీతో ఇద్దరిని కాల్చిన నీకంటే సైకో ఎవరైనా ఉంటారా, అని కౌంటర్స్ ఇచ్చారు.
