వాష్ రూమ్‌కి కూడా వెళ్లనివ్వడం లేదు.. నవాజుద్దీన్ సిద్దిఖీపై భార్య సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పై ఆయన భార్య ఆలియా సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. వాష్ రూమ్‌కి కూడా వెళ్లనివ్వడం లేదంటూ ఆరోపించారు.

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తన భార్య ఆలియా సిద్దిఖీకి మధ్య విభేదాల నేపథ్యంలో వీరిద్దరు విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. విడాకుల వరకు వెళ్లారు. అయితే పాస్ పోస్ట్ సమస్య కారణంగా భార్య ఆలియా తన ఇద్దరు పిల్లలతో కలిసి తిరిగి నవాజుద్దీన్ ఇంటికి వచ్చింది. అక్కడే ఉంటుంది. కానీ తమ ఇంట్లో ఉండకూడదని నవాజుద్దీన్ తల్లి అభ్యంతరం తెలపడంతోపాటు పోలీస్‌లకు ఫిర్యాదు కూడా చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆలియా స్పందించింది. తనని ఇంట్లో వేధిస్తున్నారని ఆరోపించింది. కనీసం భోజనం చేయనివ్వడం లేదని, వాష్ రూమ్‌కి కూడా వెళ్లనివ్వట్లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె తన లాయర్‌తో ఓ స్టేట్‌మెంట్‌ని విడుదల చేసింది. ఇందులో లాయర్ పేర్కొంటూ, నా క్లైంట్(ఆలియా)ని అవమానిస్తున్నారు, ఆమెని ఆహారం కూడా తిననివ్వడం లేదు. వాష్ రూమ్‌కి కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమెచుట్టూ బాడీగార్డ్స్ ని ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి రోజూ పోలీస్‌లకు ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లైంట్‌కి ఆహారం ఇవ్వడం లేదు. ఆమె ఉన్న హాల్‌లో సీసీ కెమెరాలు అమర్చారు` అని లాయర్ పేర్కొన్నారు.
రెండేళ్లుగా నవాజుద్దీన్, తన భార్య ఆలియా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలియా లాయర్ రిజ్వాన్ స్టేట్‌మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నవాజుద్దీన్, అలియా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా.. నవాజుద్దీన్‌కి విడాకుల నోటీసులు పంపించింది. తమ 11ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ, చాలా రోజులుగా నవాజుద్దీన్ ఫ్యామిలీ గృహ హింసకి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తుంది. అందుకే తాను విడిపోతున్నట్టు పేర్కొంది.
నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా నటిస్తున్నారు. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రధానంగా హిందీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ `బ్లాక్ ఫ్రైడే`, `గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్`, `రామన్ రాఘవ్ 2.0`, `ది లంచ్ బాక్స్`, `మ్యాంటో`, `సాక్రెడ్ గేమ్స్`, `ఠాక్రే`, `రాయీస్`, `మామ్`, `పెటా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో వెంకటేష్ నటిస్తున్న `సైంధవ్`లో కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు.