స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమాజంలో కుల పిచ్చి ఎక్కువైందన్న మోహన్ బాబు దాని వలన నాశనమే అన్నారు.
నటుడు మోహన్ బాబు ముక్కుసూటి మనిషి. విషయం ఏదైనా ముఖాన మాట్లాడతాడనే పేరుంది. మోహన్ బాబుకు ఉన్న ఈ తత్త్వం పలుమార్లు వివాదాలకు దారి తీసింది. తాజాగా ఆయన తిరుపతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం వెళ్లారు. అక్కడ మొక్కలు నాటారు. స్థానికులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
'ఒకప్పుడు మనుషులు కులాలకు అతీతంగా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని బంధుత్వాలతో పిలుచుకునేవారు. మనుషుల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది లేదు. కులాల పేరిట తిట్టుకుంటున్నారు. మనుషుల్లో కుల పిచ్చి ఎక్కువైపోయింది. ఒకరిని వాళ్ళ మంచితనం ఆధారంగా గౌరవించాలి. కులం ఆధారంగా కాదు. కుల పిచ్చి వలన అంతా నాశనమే. పైన దేవుడు ఉన్నాడు. అన్నీ గమనిస్తూ ఉంటాడు.
బాల్యం నుండి నేను కులాలకు వ్యతిరేకిని. చిన్నతనంలో నా మిత్రుడిని కొందరు కులం ఆధారంగా కించపరిస్తే చెప్పుతో కొట్టబోయాను' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మోహన్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా గత ఏడాది మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా చిత్రంతో పలకరించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన అగ్ని నక్షత్రం చిత్రంలో మోహన్ బాబు నటించినట్లు సమాచారం. అగ్ని నక్షత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
మరోవైపు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి. ఆయన కుమారులు విష్ణు, మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మనోజ్ ఇటీవల రెండో వివాహం చేసుకోగా విష్ణు హాజరు కాలేదు. వివాహమైన కొద్ది రోజులకు మనోజ్ అన్నయ్య విష్ణు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది అత్యంత వివాదాస్పదమైంది. అది ఓ షో కోసం చేసిన ఫ్రాంక్ అని విష్ణు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు.
