ప్రముఖ సినిమా, టీవీ నటుడు మహర్షి రాఘవం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గోగినేని కమలమ్మ(84) కన్నుమూశారు. 

ప్రముఖ టాలీవుడ్‌ నటుడి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సినీ, టీవీ నటుడిగా రాణిస్తున్న `మహర్షి` రాఘవ తల్లి కన్నుమూశారు. వయసు, అనారోగ్యం రీత్యా `మహర్షి` రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో మహర్షి రాఘవ ఫ్యామిలీ కన్నీరుమున్నీరవుతుంది. 

గోగినేని కమలమ్మకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నారు. రెండో కుమారుడు వెంకట్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. రాఘవ తల్లి మరణించిందనే వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాఘవ ఫ్యామిలీకి సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నారు. రాఘవ తల్లి కమలమ్మ అంత్యక్రియలు గురువారం జూబ్లీ హిల్స్‌ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇదిలా ఉంటే దర్శకుడు వంశీ రూపొందించిన `మహర్షి` చిత్రంలో కథానాయకుడిగా నటించి ఆ సినిమాని తన ఇంటిపేరుగా చేసుకున్నారు రాఘవ. దాదాపు 170కిపైగా చిత్రాల్లో నటుడిగా నటించి ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో హీరో పాత్రలు పోషించి వెండితెరపై అలరించింది. ఆయన నటించిన చిత్రాల్లో `మహర్షి` తోపాటు `చిత్రం భళారే విచిత్రం`, `జంబలకిడిపంబ`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` , `చంటి`, `మాతృదేవోభవ`, `నెంబర్‌ 1`, `పోకిరి రాజా`, `దేవుడు`, `శీను`, `నిన్ను చూడాలని` వంటి సినిమాలు ప్రధానంగా ఉన్నాయి. 

సినిమాల్లోనే కాదు, టీవీ రంగంలో ఆయన మరింతగా రాణించారు. సినిమాల్లో కంటే టీవీ రంగంలోనే బాగా పేరుతెచ్చుకున్నారు. సీరియల్స్ లో లీడ్‌ రోల్స్ ప్లే చేసి ఇంటి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు మహర్షి రాఘవ.