చిత్ర పరిశ్రమలలో వరుస మరణాలు కుటుంబాలలో తీరని శోకం నింపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గత ఏడాది కాలంలో అనేకమంది చిత్ర ప్రముఖులు దుర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనేక మందిని బలితీసుకుంది. కరోనా కారణంగా దర్శక నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు తుది శ్వాసవిడిచారు. 


గొప్ప కమెడియన్, మానవతావాది, సోషలిస్ట్ వివేక్ మరణం కోలీవుడ్ లో తీవ్ర విషాదం నింపింది. కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వివేక్ ఆ మరుసటిరోజే గుండెపోటుకు గురయ్యారు. వివేక్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించడం జరిగింది. 


వివేక్ మరణాన్ని మరువక ముందే మరో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటుడు కుట్టి రమేష్‌ అనారోగ్యంతో శుక్రవారం కన్నుముశారు. పలు టీవీ సీరియల్‌లలో నటించి గుర్తింపు పొందిన కుట్టి రమేష్‌ నిన్నశుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తమిళ విజయ్‌ టీవీలో ప్రసారం అవుతున్న ‘తేన్‌మోవి’, ‘బీఏ’ వంటి మెగా సీరియల్స్‌తో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కుట్టి రమేష్‌ మృతి తీరని లోటని విజయ్‌ టీవీ బృందం సంతాపం ప్రకటించింది.