`అల వైకుంఠపురములో` ఫేమ్‌ నటుడు జయరామ్‌కి కరోనా సోకింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. 

విలక్షణ నటుడు జయరామ్‌(Jayaram) సుబ్రమణ్యంకి కరోనా సోకింది. తాజాగా ఆయనకు కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా మన మధ్యనే ఉందనే విషయాన్ని ఈ ఫలితం హెచ్చరిస్తుందని తెలిపారు. `ఈ రోజు నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ ఇంకా మన మధ్యలోనే ఉందనే విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఇటీవల నన్ను కలిసిన వారంతా ఎలాంటి లక్షణాలు కనిపించినా టెస్ట్ చేయించుకోండి. ఎవరికి వారు ఐసోలేట్‌ అవ్వండి. నేను నా ట్రీట్‌మెంట్‌ని స్టార్ట్ చేశాను. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను` అని తెలిపారు జయరామ్‌. 

View post on Instagram

కరోనా వైరస్‌ రోజు రోజుకి మరింత తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో అనేక మంది సెలబ్రిటీలు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో స్టార్‌ హీరోలు కూడా ఉండటం గమనార్హం. మహేష్‌బాబు, థమన్‌, కీర్తిసురేష్‌. బండ్లగణేష్‌ వంటి వారు ఇప్పటికే కరోనా బారిన పడి దాన్నుంచి కోలుకున్నారు. 

ఇక మలయాళంకి చెందిన జయరామ్‌.. ఇప్పుడు తెలుగులోనూ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా రాణిస్తున్నారు. అనుష్క శెట్టి నటించిన `భాగమతి` చిత్రంతో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పొలిటికల్‌ లీడర్‌గా ఆయన నటన అందరిని కట్టిపడేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. బన్నీకి నాన్న పాత్రని పోషించారు. మరోవైపు ఇప్పుడు `రాధేశ్యామ్‌`, `సర్కారు వారి పాట`, రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మణిరత్నం `పొన్నియిన్‌సెల్వన్‌` చిత్రంలోనూ యాక్ట్ చేస్తున్నారు.