శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు నటుడిగా, దర్శకుడిగా అనేక సినిమాలకు పనిచేసిన చిన్నా అనారోగ్యం కారణంగా మృతి చెందిన చిన్నా సతీమణి శిరీష
తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రం తెలుగు ఇండస్ట్రీ స్టైల్ నే మార్చేసింది. ఈ చిత్రంలో నాగార్జున ఫ్రెండ్స్ గా నటించిన వారిలో చిన్నా ఒకరు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో నటించిన చిన్నా తర్వాత దర్శకత్వం కూడా వహించారు. త్వరలోనే రాజకీయాల్లో కూడా ఆరంగేట్రం చేయనున్నారు చిన్నా. ప్రస్తుతం చిన్నా ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సతీమణి శిరీష (42) కన్నుమూశారు.
ఇప్పటికే దాసరి, సినారే, రవితేజ తమ్ముడు భరత్ లను కోల్పోయిన తెలుగు సినీపరిశ్రమకు... దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతితో మరో విషాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచింది. చిన్నా-శీరిష దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.
చిన్నా అసలు పేరు జితేంద్రరెడ్డి.. దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ మూవీలో హీరో నాగార్జున ఫ్రెండ్ గా చిన్నా బాగా పాపులర్ కావడంతో ఆ పేరుతోనే ఇండస్ట్రీలో కొనసాగారు. ‘ఆ ఇంట్లో’ అనే సినిమాకు దర్శకత్వం సైతం వహించాడు. అటుతర్వాత టీవీకి షిప్ట్ అయి సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.భార్య మృతి చెంది విషాదం లో ఉన్న చిన్నా ని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
