దిల్ రాజుకు ఎదురెళ్లి చిక్కుల్లో పడ్డారు యువ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. ఆచార్య రూపంలో అతడు భారీ నష్టాలు చవిచూడడం ఖాయంగా కనిపిస్తుంది. ఆచార్య హక్కులు భారీ ధర చెల్లించి దక్కించుకున్న వరంగల్ శ్రీను పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు (Dil Raju)ఓ మర్రి చెట్టులా పాతుకుపోయాడు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు నైజాం కింగ్ అయ్యాడు. ఏళ్ల తరబడి గడించిన అనుభవంతో పదుల సంఖ్యలో తెలంగాణాలో థియేటర్స్ గుప్పెట్లో పెట్టుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలన్నింటినీ నైజాంలో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ క్రమంలో అక్కడ వేరెవరినీ డిస్ట్రిబ్యూటర్ గా ఎదగనీయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా తన ఇష్టం మేరకు ఓ మూవీని థియేటర్స్ లో ఉంచడం, తీసేయడం చేస్తారనే పుకార్లు ఉన్నాయి. 

ఈ క్రమంలో వరంగల్ శ్రీను(Warangal Srinu) అనే యువకుడు కొన్నాళ్లుగా దిల్ రాజుకు పోటీ ఇస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాలతో పాటు హిట్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాగా ఆచార్య మూవీ నైజాం హక్కులను దిల్ రాజును కాదని వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. దాదాపు రూ. 36-40 కోట్లు చెల్లింది ఆచార్య రైట్స్ కొనుగోలు చేశారు. సినిమాపై ఉన్న బజ్ రీత్యా దిల్ రాజు ఆచార్య హక్కుల విషయంలో తగ్గాడు. 

అయితే అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ అయ్యింది. ఆచార్య (Acharya movie)ను కొన్న వరంగల్ శ్రీనుకు మాత్రం పెద్ద బొక్క పడేలా కనిపిస్తుంది. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఆచార్య నైజాంలో దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ డే ఈ మూవీ అక్కడ రూ. 7.9 కోట్ల షేర్ రాబట్టింది. సినిమాకు వచ్చిన టాక్ రీత్యా సెకండ్ డే కలెక్షన్స్ మరింత ఘోరంగా ఉండే ఆస్కారం కలదు. ఈ క్రమంలో ఆచార్య వరంగల్ శ్రీనుకు యాభై శాతం మేర నష్టాలు మిగిల్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డిస్ట్రిబ్యూటర్ కి ఇది భారీ కుదుపని చెప్పాలి. 

పంతానికి పోయి ఎక్కువ ధరకు హక్కులు కొని వరంగల్ శ్రీను నష్టపోయాడు. ఇక చాలా కాలంగా దిల్ రాజు, వరంగల్ శ్రీను మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది. రవితేజ క్రాక్ చిత్రాన్ని వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ చిత్రానికి పోటీగా విడుదలైన డబ్బింగ్ మూవీ మాస్టర్ ని దిల్ రాజు నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్లాప్ టాక్ తెచ్చుకున్న మాస్టర్ మూవీకి అత్యధిక థియేటర్స్ కేటాయించడంతో పాటు, అధిక వసూళ్లు రాబట్టే థియేటర్స్ ఉద్దేశపూర్వకంగా క్రాక్ చిత్రానికి దిల్ రాజు దక్కకుండా చేస్తున్నాడని వరంగల్ శ్రీను ఓపెన్ గా కామెంట్స్ చేశారు. 

ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే బూతులు తిట్టి అవమానించారని, ప్రెస్ మీట్ పెట్టి వరంగల్ శ్రీను పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దిల్ రాజు కారణంగా క్రాక్ మూవీ నైజాంలో వసూళ్లు కోల్పోతుందని ఆరోపించాడు. ఈ ఘటన జరిగి ఏడాది దాటింది. అలాగే కెజిఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్(RRR Movie) హక్కులు కొన్న దిల్ రాజు ఆచార్యకు థియేటర్స్ ఎక్కువగా దక్కకుండా చేశారనే వాదన కూడా ఉంది. మొత్తంగా వరంగల్ శ్రీనుకు ఆచార్య విషయంలో అన్నీ ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు ఏ మేరకు నష్టాలు తగ్గించుకుంటాడో చూడాలి.