ఆ మధ్యన అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి జీవిత కథతో చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్‌ ఇప్పుడు మరో చిత్రం ప్లానింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కించటానికి గత రెండేళ్లుగా పనులు చేస్తున్నారు.  

ఈ పౌరాణిక గాథను   దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. దగ్గుపాటి రానా ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ లో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని చూస్తున్నారు. ఇప్పటికే చాలా సెట్లు ఈ సినిమా కోసం నిర్మాణమవుతున్నాయి. వాటిని సురేష్ బాబు పర్యవేక్షిస్తూ మరో ప్రక్క స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారు.

అలాగే ఈ సినిమాకోసం అంతర్జాతీయంగా 17 స్టూడియోలు దాకా విఎఫ్ ఎక్స్ పనిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీ,నటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం  రానా భారీగా రాక్షసుడు లా తన లుక్ ని మార్చుకోబోతున్నారు. 

నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ..."ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే వున్నాము. దర్శకుడు గుణశేఖర్ వైపు నుంచి కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులు 'లండన్' లో జరగనున్నాయి. ఈ సినిమాకి రానాయే నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన వుంది. భారీ ప్రాజెక్టు కనుక ఆలస్యం అవుతోంది" అన్నారు.    

అయితే మార్కెట్‌ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని సోలోగా ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.