రివ్యూ: అభిమన్యుడు

abhimanyudu movie telugu review
Highlights

తను తమిళంలో నటించే ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు విశాల్.

నటీనటులు: విశాల్, సమంతా, యాక్షన్ కింగ్ అర్జున్ తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌రాజా

సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌

ఎడిటింగ్‌: రూబెన్‌

మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి

నిర్మాత: జి.హరి

దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌

తను తమిళంలో నటించే ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు విశాల్. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా అన్నట్లు ఇక్కడ కూడా ప్రమోషన్స్ బాగా చేస్తుంటారు. రీసెంట్ గా అతడు నటించిన 'ఇరుంబు తిరై' సినిమా తమిళంలో విడుదలై సక్సెస్ టాక్ సంపాదించుకుంది. అదే చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో తెలుగులో విడుదల చేశారు. ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించింది చిత్రబృందం. మరి తెలుగు ఆడియన్స్ ను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం!

కథ

అప్పుల వాళ్లను మోసం చేస్తూ సిగ్గు లేకుండా బ్రతికే తన తండ్రిని చూసి విరక్తి చెందిన కరుణాకరన్(విశాల్) చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అప్పటినుండి అతడికి  అప్పు తీసుకోవడం అంటేనే నచ్చదు. కొన్నాళ్లకు మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్ గా జాయిన్ అవుతాడు. అందరూ అతడిని కర్ణ అని పిలుచుకుంటారు. అతడికి కోపం చాలా ఎక్కువ. దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని అధికారులు సూచిస్తారు. ఏంగర్ మేనేజ్మెంట్ లో సర్టిఫికేట్ తేవాలని చెబుతారు. దానికోసం ఇష్టం లేకుండానే లతాదేవి(సమంతా) అనే డాక్టర్ ను కలుస్తారు. ఆమె సూచనల మేరకు కొద్దిరోజుల పాటు సొంతూరుకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అక్కడ తన చెల్లి పెళ్లి కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది. లోన్ కోసం ఎన్ని బ్యాంకులు తిరిగినా పని మాత్రం అవ్వదు. దీంతో ఓ మధ్యవర్తి సహాయంతో లోన్ పొందుతారు. అడ్డదారిలో లోన్ తెచ్చుకోవడం కర్ణకు కూడా ఇష్టం ఉండదు కానీ చెల్లి పెళ్లి కోసం రాజీ పడతాడు. అయితే బ్యాంక్ లో ఉండాల్సిన డబ్బు తెలియకుండానే పోతుంది. వైట్ డెవిల్ అనే యూజర్ నేమ్ తో అందరి అకౌంట్లను హ్యాక్ చేసి అక్రమంగా డబ్బుని తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు సత్యమూర్తి(అర్జున్) అనే వ్యక్తి. తనలానే చాలా మంది డేటాను హ్యాక్ చేసి డబ్బు కొట్టేస్తున్నాడని తెలుసుకుంటాడు కర్ణ. మరి అతడి ఆగడాలను కర్ణ బయటపెట్టగలిగాడా..? అసలు వైట్ డెవిల్ కు అందరి డేటా ఎలా వస్తుంది..? ఈ ఇన్ఫర్మేషన్ ను అతడు ఏ విధంగా వాడుకుంటున్నాడు..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది. 

కళాకారుల పనితీరు: 

విశాల్ ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ రోల్ పోషించినప్పటికీ ఎక్కువ టైమ్ ఆ గెటప్ లో కనిపించడు. ఒక తప్పును ఎదిరించే ఓ వ్యక్తిగా అతడి నటన బాగుంది. గతంలో చాలా చిత్రాలలో ఈ తరహా పాత్రలు చేశాడు. విశాల్ కు ఉన్న యాక్షన్ హీరో ఇమేజ్ ను పెద్దగా వాడుకోలేదనే చెప్పాలి. కానీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక సినిమాలో మరో మెయిన్ క్యారెక్టర్ లో కనిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తనదైన నటనతో అందరినీ మెప్పిస్తాడు. పతాక సన్నివేశాల్లో హీరో, విలన్ తలపడే సన్నివేశాల్లో విశాల్ ను అర్జున్  బాగా డామినేట్ చేశాడు. ఆరడుగుల ధృడమైన శరీరంతో విశాల్ కనిపిస్తున్నా అందరి దృష్టి అర్జున్ మీదే ఉంటుంది. అంతగా మెస్మరైజ్ చేశాడు. హీరోయిన్ గా సమంతా పాత్ర  అంతంతమాత్రంగానే ఉంది. కథలో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టినట్లున్నారే తప్ప ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. క్లైమాక్స్ సీన్ లో ఆమె రోల్ ను హైలైట్ చేస్తూ ఓ సీన్ పెట్టినా వర్కవుట్ కాలేదు. ఆ సీన్ లో సమంతా ఉండాల్సిన అవసరమే లేదు.. విశాల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరున్నా సరిపోతుంది. అయినప్పటికీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. మిగిలిన పాత్రధారులు తమ పరిధిలో బాగానే నటించారు. 

సాంకేతికవర్గం పనితీరు: 

సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది. అది కూడా రాంగ్ ప్లేస్మెంట్.. సీరియస్ కథనంతో సాగే సినిమాలో ఆ పాట పంటికింద రాయిలా అనిపిస్తుంది. అనువాద సాహిత్యం ఆకట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది. విలన్ క్యారెక్టర్ తెరపై కనిపించే ప్రతిసారి ప్లే చేసిన బీజియమ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. ఎడిటింగ్ పరంగా ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువగా కనిపిస్తాయి. డైరెక్టర్ మిత్రన్ అనుకున్న పాయింట్ ను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ గా కొన్ని సన్నివేశాల్లో రాణించాడు. హీరో, విలన్ క్లైమాక్స్ ఫైట్ ను బాగా చిత్రీకరించాడు. ఇక ప్రీక్లైమాక్స్ మిలిటరీ ఆఫీసర్ గా విశాల్ పై తీసిన సీన్ బాగా పండింది. ముందు మొత్తం సాగదీసిన సినిమాను హడావిడిగా ముగించాడనిపిస్తుంది. 

హైలైట్స్: 

నేటి ట్రెండ్ కు తగ్గ కథను ఎన్నుకోవడం 

అర్జున్, విశాల్ ల పెర్ఫార్మన్స్

సెకండ్ హాఫ్ 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

డ్రాబ్యాక్స్: 

ఫస్ట్ హాఫ్ 

సాగదీసిన స్క్రీన్ ప్లే 

విశ్లేషణ: 

''ఇంతకముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్ ఆ తరువాత బయోవార్ ఇప్పుడు సైబర్ వార్..'' అంటూ ఒక్క డైలాగ్ లో ఈ సినిమా ఏంటో చెప్పేశారు. సైబర్ వార్ నేపధ్యంలో సాగే ఈ కథ నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతుంది. మన రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక భాగమైపోయింది. అదే స్మార్ట్ ఫోన్ మన జీవితాలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. సరదాగా షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు గిఫ్ట్ కోసం, ఇంటర్నెట్ లో బ్రౌస్ చేసేప్పుడు, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం ఇలా మనకు తెలియకుండా మనకు సంబంధించిన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ను షేర్ చేస్తున్నాం. దీన్ని అదనుగా చేసుకొని డబ్బు సంపాదించేవారు కూడా ఉంటారు.

అలా ప్రజల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఒక విలన్ క్యారెక్టర్ తో ప్రజలకు న్యాయం జరగాలని పోరాడే మిలిటరీ ఆఫీసర్ కథే ఈ సినిమా. సినిమాలో విలన్ క్యారెక్టర్ ను బాగా చూపించారు. కానీ అతడి నేపాధ్యాన్ని సింపుల్ గా రెండు ముక్కల్లో తేల్చేశారు. అలా అని హీరో క్యారెక్టర్ ఏమైనా బలంగా చూపించారా అంటే లేదు. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. సత్యమూర్తి అలియాస్ వైట్ డెవిల్(అర్జున్) తలపెట్టిన ఒక పెద్ద స్కామ్ ను భగ్నం చేయడానికి కర్ణ(విశాల్) వేసే ప్లాన్ నుండి సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అంతవరకు నత్త నడకన నడిచిన సినిమా కాస్త ఒక్కసారిగా పరుగందుకుంటుంది. ఇంటర్వల్ సీన్ తోనే విలన్ ఎంత పవర్ ఫుల్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అతడిని దెబ్బ తీయడం అంతా తేలిక కాదనే పాయింట్ తో సెకండ్ హాఫ్ పై ఎక్సయిట్‌మెంట్‌ పెరుగుతుంది. అందుకు ఏ మాత్రం తగ్గని తెలివైన కథనంతో సెకండ్ ఆసక్తికరంగానే నడిపించారు.

కానీ కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయింది. పూర్తిగా హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్స్ తో సాగుతున్నా కొన్ని చోట్ల ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయారు. రొటీన్ క్లైమాక్స్ తో సినిమాను ముగించేశారు. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ తగ్గించి చెప్పాలనుకున్న పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పి ఉంటే బాగుండేది. అనవసరపు పాత్రలను, సన్నివేశాలను సినిమాకు జోడించి కావాలని నిడివి పెంచినట్లు అనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన పాయింట్ అభినందనీయం కానీ ఇది మాస్ ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ఊహించలేం. 

రేటింగ్: 2.75/5 

loader