`రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నా వాడు. అతను నా ఫ్రెండ్‌, ఇప్పటికీ మేమిద్దరం టచ్‌లోనే ఉంటాం` అని అంటున్నాడు బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌. ఆయన షో పూర్తయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. విజయ్‌ గురించి తనకు వచ్చిన ఆఫర్ల గురించి చెప్పుకొచ్చాడు. 

విజయ్‌ దేవరకొండ గురించి చెబుతూ, `విజయ్‌ దేవరకొండ నా ఫ్రెండ్‌. అతను నా వాడు. మేం ఇప్పటికీ టచ్‌లోనే ఉంటాం. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన కెరీర్‌ గ్రాఫ్‌ ఉంటుంది. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` లో నటించిన ప్రతి ఒక్కరు ప్రతిభావంతులే. విజయ్‌ ప్రతి సినిమాలో తన అద్బుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. నేను షోలో ఉన్నప్పుడు విజయ్‌, నాగబాబు సర్‌, శ్రీకాంత్‌ సర్‌, బ్రహ్మానందం` నన్ను సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా` అని తెలిపారు. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`లో అభిజిత్‌, విజయ్‌ దేవరకొండ కలిసి నటించిన విషయం తెలిసిందే. 

`2013లో ఓ ఆడియో ఫంక్షన్‌లో మొదటిసారి నాగబాబు సర్‌తో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఇప్పటికీ ఆయన గుర్తుపెట్టుకున్నారు. నన్ను సపోర్ట్ చేవారు. సీజన్‌ విజేతగా నిలిచిన తర్వాత బ్రహ్మానందం నాకు ఫోన్‌ చేసి అభినందించారు. ఒకసారి కలవమని చెప్పారు. ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా` అని చెప్పారు. 

ఇదిలా ఉంటే అభిజిత్‌ మరో బంపర్‌ ఆఫర్‌ని దక్కించుకున్నారట. ఆయనకు ఇప్పటికే రెండు, మూడు సినిమా ఆఫర్లు, పదికిపైగా వెబ్‌ సిరీస్‌లు ఆఫర్లుగా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే సమంతతోనూ ఓ ఆఫర్‌ వరించిందట. సమంత ప్రస్తుతం హోస్ట్ గా `సామ్‌జామ్‌` టాక్‌ షోని నిర్వహిస్తుంది. ఈ షోకి గెస్ట్ గా అభిజిత్‌ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇదే సెట్‌ అయితే త్వరలోనే సమంతతో కలిసి సందడి చేయబోతున్నాడు అభిజిత్‌.