విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు 'అదుగో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశ పరిచాడు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి 'ఆవిరి' అనే టైటిల్‌ నిప్రకటించారు. ఈ సినిమాని దిల్ రాజు టేకప్ చేయడంతో కాస్త అంచనాలు పెరిగాయి.

కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్‌ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంది.

తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ని ఆసక్తికరంగా డిజైన్ చేశారు. స్టవ్ మీద కొంచెం తెరిచి ఉంచిన ప్రెజర్ కుక్కర్, దానిలో కళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తోన్న మనిషి తల, కుక్కర్ లోపల నుంచి బయటికి వస్తోన్న ఆవిరి ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి.

ఈ పోస్టర్ ని బట్టి మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను రవిబాబు ప్రేక్షకులకు అందించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వైధ్య్ సంగీతం సమకూరుస్తున్నారు.