ఈ మద్యకాలంలో  ఎక్కువగా మీడియాలో చర్చించబడి, రీమేక్ గా రాబోతోందని ప్రచారం జరిగిన చిత్రం విక్రమ్ వేద.  గత పదేళ్ల కాలంలో  వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటి  ‘విక్రమ్ వేద’. భార్యాభర్తలైన పుష్కర్ గాయత్రి తీసిన ఈ సినిమా ఇటు విమర్శకులను, అటు ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కమర్షియల్‌గానూ చాలా పెద్ద హిట్టయింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి ఫిలిం ఇన్‌స్టిట్యూట్లలో పాఠాలు చెబుతున్నారు. 

దాంతో  మీడియాకు గుర్తు వచ్చినప్పుడల్లా ఎవరో ఇద్దరు హీరోలను తీసుకుని ఆ రీమేక్ లో చేస్తున్నారంటూ  స్టోరీ రాసేసి, ట్రెండింగ్ లోకి తెచ్చింది.  అందులో భాగంగా రాజశేఖర్, బాలకృష్ణ  లతో ముడి పెట్టి ఈ రీమేక్ గురించి తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఏ హీరో ఆ ధైర్యం చేయలేదు. ఆ వార్తలన్ని ఫేక్ అని మీడియా  వండి వార్చినవే అని తేలిపోయాయి. 

అయితే హిందీలో మాత్రం ‘విక్రమ్ వేద’ రీమేక్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది.  చాలాకాలంగా  సాగుతున్న నటీనటుల వేటకు దాదాపుగా ముగిసినట్లే అని సమాచారం సమాచారం.  

తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రలో ఆమిర్ ఖాన్.. మాధవన్ చేసిన క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారని తెలుస్తోంది.  మాతృకను డైరెక్ట్ చేసిన భార్యాభర్తల దర్శక ద్వయం పుష్కర్-గాయత్రినే హిందీ వెర్షన్‌‌ను కూడా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. 

ఎ వెడ్నస్ డే, బేబీ, స్పెషల్ చబ్బీస్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు నీరజ్ పాండే ‘విక్రమ్ వేద’ రీమేక్‌ను నిర్మిస్తున్నారు.  అలాగే బాలీవుడ్  ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నేటివిటీ, స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ప్రస్తుతం అమీర్ ఖాన్ హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’  అఫీషియల్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తయ్యాక ఈ  ప్రాజెక్టులోకి వస్తాడు.