బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి పోటి పడుతున్న నటుల్లో ఆమిర్‌ ఖాన్‌ ఒకడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతోనే ఇండస్ట్రీ హిట్స్‌ సాధిస్తున్న ఆమిర్‌.. అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు ఆమిర్‌ తీసుకున్న రెమ్యూనరేషన్‌ వందకోట్ల పై మాటే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే తన చివరి సినిమా థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు ఆమిర్‌.

ఈ సినిమా డిజాస్టర్ కావటంతో తదుపరి చిత్రానికి లాంగ్ గ్యాప్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో నటిస్తున్నాడు ఆమిర్‌ ఖాన్‌. లాక్‌ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే వెండితెర మీద సత్తా చాటుతూనే బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేశాడు ఆమిర్‌. సామాజిక అంశాల మీద స్పందించే ఆమిర్‌ ఖాన్ అదే కాన్సెప్ట్‌తో రూపొందిన సత్యమేవ జయతే షోకు హోస్ట్‌గా వ్యవహరించాడు.

2012లో ప్రారంభమైన ఈ షో కోసం ఆమిర్‌ భారీ పారితోషికం అందుకుంటున్నాడు. త్వరలో ఈ షో కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే ఆ షో కోసం ఒక్కో ఎపిసోడ్‌ ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నాడట ఆమిర్‌ ఖాన్. గత సీజన్లు ఆమిర్‌ హోస్ట్ చేయటం వల్లే సూపర్‌ హిట్‌ అయ్యాయని భావిస్తున్న నిర్వాహకులు ఆమిర్‌ అడిగినంత రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.