సినిమా అంటే పడిసచ్చే వాళ్లు, సినిమా అవకాశం అంటే ఎంతకైనా తెగించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వీళ్ల వీక్నెస్ ని క్యాష్ చేసుకొనే మోసగాళ్లు కూడా ప్రతి చోటా ఉన్నారు. వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునే వాళ్లకు ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ అంటే.. ఇక ఆగుతారా... గుడ్డిగా ఫాలో అయిపోతారు.  ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తామని ఓ ముఠా ఇలానే మోసం చేసింది. 

విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ప్రభాస్ మూవీలో నటించే అవకాశం ఉందంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరిట కొందరు నమ్మబలికారు. అవకాశం దక్కాలంటే ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని వారు సూచించారు. అది నమ్మిన కొందరు రిజిస్ట్రేషన్ కోసం  కొంత డబ్బులు వారి చెల్లించడం జరిగింది.  త్వరలోనే మీకు మెసేజ్ వస్తుంది, సిద్ధంగా ఉండాలని సదరు ప్రొడక్షన్ హౌస్ వారికి తెలియజేశారట. డబ్బులు చెల్లించి చాలా కాలం అవుతున్నా మెసేజ్ రాకపోవడంతో అనుమానంతో ప్రొడక్షన్ హౌస్ కి వెళ్లగా అక్కడ ఎవరూ లేరట. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారట. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుండి రూ. 5 నుండి 10వేలు వసూలు చేసినట్లు సమాచారం. ముంబై వేదికగా ఈ మోసం జరిగినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా యుగంలో కూడా సినిమా పిచ్చితో కొందరిని గుడ్డిగా నమ్మి ఇలా చాలా మంది మోసపోతున్నారు.