బింబిసార ప్రీ రిలీజ్ వేదికగా ఎన్టీఆర్, బాలయ్య మధ్య విబేధాలు తెరపైకి వచ్చాయి. పక్కా ప్లాన్ తో వేడుకకు వచ్చిన ఇరు వర్గాల ఫ్యాన్స్ పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఏంటీ!... అందరూ నందమూరి ఫ్యాన్స్ కాదా? అనే సందేహం మీకు కలగవచ్చు. వాస్తవంలో ఇదే నిజం. నందమూరి వీరాభిమానులు ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ గా విడిపోయి చాలా కాలం అవుతుంది. కొందరి రాజకీయ చదరంగం కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లకు పైగా నందమూరి కుటుంబం మొత్తం ఒకవైపు హరి కృష్ణ కుటుంబం ఒకవైపు అన్నట్లు ఉంటున్నాయి. హరికృష్ణ మరణం తర్వాత కూడా ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్యకు దగ్గర కాలేదు. 

ఓ దశలో బాలయ్య(Balakrishna)తో పాటు నారా కుటుంబం హీరోగా కూడా తనని తొక్కేయాలని చూశారని, ఎన్టీఆర్ తో పాటు ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. టీడీపీకి చెందిన ఒక వర్గం ఎన్టీఆర్ సినిమాలను దెబ్బతీశారనే వాదన పరిశ్రమలో ఉంది. 2009 ఎన్నికల్లో తాత స్థాపించిన టీడీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన ఎన్టీఆర్... ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరమయ్యాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కి, ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదు. బాలయ్య మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 

అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో సమీకరణాలు మారిపోయాయి. కొడుకు లోకేష్ కోసం పార్టీ భవిష్యత్తు చంద్రబాబు నాశనం చేశాడని నమ్ముతున్న టీడీపీలోని ఒక వర్గం జై ఎన్టీఆర్ అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీలోకి ఆహ్వానించి ఆయనకి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  బాబు బహిరంగ సభలు, రోడ్ షోస్ లో జై ఎన్టీఆర్ నినాదాలు కామనై పోయాయి. ఆ విధంగా ఎన్టీఆర్(NTR) సానుభూతిపరులు చంద్రబాబుకు నిరసన సెగలు రుచి చూపిస్తున్నారు. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. 

బాబుతో పాటు బాలయ్య వర్గానికి ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు.దీంతో నందమూరి అభిమానుల్లో ఎన్టీఆర్ వెర్సస్ బాలయ్య అనే పరిస్థితి నెలకొని ఉంది. దీన్ని బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ మరోసారి రుజువు చేసింది. బింబిసార ప్రీ రిలీజ్ వేడుకకు(Bimbisara Prerelease event) వచ్చిన నందమూరి అభిమానులు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం జై ఎన్టీఆర్ అంటుంటే మరో వర్గం జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ రెండు వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం కనిపించింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఫ్యాన్స్ మధ్య చర్చ నడిచింది. 

ఎన్టీఆర్ వర్గం సీఎం నినాదాలు చేయాలని, బాలయ్య వర్గం జై బాలయ్య నినాదాలతో వేడుకను డామినేట్ చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకొని మరీ వచ్చారు. దానికి తోడు బింబిసార వేడుకలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లలో ఏ ఒక్కరు బాలయ్య పేరు ప్రస్తావించలేదు. ఇవన్నీ గమనిస్తుంటే ఫ్యాన్స్ మధ్యే కాకుండా అంతర్గతంగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనిపిస్తుంది.