#Chinmayi:సింగర్ చిన్మయిపై హైదరాబాద్ పోలీస్ కేసు ,కారణం ఏంటంటే
సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టిన సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మీడియాకు ఎక్కుతూంటుంది గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద. ఆమె పై తాజాగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో (Gachibowli Police Station) కేసు నమోదు అయ్యింది. ఆమె రెండు రోజుల క్రితం భారతదేశం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురించి హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె పై కేసు నమోదు చేశారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Actor Annapurnamma) మహిళల వేషధారణ గురించి ప్రస్తావించారు. ‘ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్రం దేనికి.. రాత్రి 12 గంటల తర్వాత మహిళలకు బయట ఏంపని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా సరే.. వాళ్లు (పురుషులు) ఏదో ఒకటి అనేటట్లుగా రెడీ అవుతున్నాం. ఎదుటివాళ్లదే తప్పనడం కాదు మనవైపు కూడా చూసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు.
అన్నపూర్ణ వీడియోను షేర్ చేస్తూ.. ఆమె నటనకు అభిమానినని చెబుతూ, మనం అభిమానించే వాళ్లు ఇలా మాట్లాడితే తీవ్రమైన వేదన కలుగుతుందని చిన్మయి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ.. ‘ఇదొక .... కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోనే ఇప్పుడు కేసుకు కారణమైంది.
ఆమె నటి అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆమె పేరును మాత్రమే ప్రస్తావించాలి. అంతేకానీ యావత్ భారతదేశాన్ని అనడానికి ఆమెకు ఎలాంటి హక్కు లేదని సాగర్ పేర్కొన్నారు. భారత్ లో ఉంటూ భారత్ సౌకర్యాలు అన్నింటిని అనుభవిస్తూ , భారత్ లో పుట్టడమే ఖర్మ అనడం, భారత్ ను ఓ చెత్త దేశం అని అనడం చాలా బాధకరమంటూ బాధ్యత గల పౌరుడిగా భారత్ పట్ల అగౌరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినట్లు సాగర్ తెలిపారు.