అందం, అభినయంతో దశాబ్ధాలుగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రమ్యకృష్ణ. అమాయకురాలైన ఆడపిల్లగా కంటతడి పెట్టించడంతో పాటు పొగురుబోతు పిల్లగానూ రమ్య మెప్పించారు.

చెన్నైలో స్థిరపడిన ఆమె పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలో రమ్యకృష్ణ  కారులో భారీగా మద్యం పట్టుబడిందన్న వార్తలతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.

శనివారం చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రమ్యకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు (టీఎన్07క్యూ0099)ను నిలిపివేసిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భారీగా మద్యం వెలుగు చూసింది. సుమారు 96 బీర్ బాటిల్స్, 8 లిక్కర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రమ్య కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే రమ్యకృష్ణ స్వయంగా వచ్చి సెల్వకుమార్‌ను బెయిల్‌పై తీసుకుని వెళ్లినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.