Asianet News TeluguAsianet News Telugu

7(సెవెన్) మూవీ రివ్యూ

అప్పుడెప్పుడో అంటే 2008 లో హాలీవుడ్ లో 'ది క్యూరియస్ కేసు ఆఫ్ బెంజిమెన్ బటన్' అనే సినిమా రిలీజైంది. 

7 movie review
Author
Hyderabad, First Published Jun 6, 2019, 10:42 AM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

అప్పుడెప్పుడో అంటే 2008 లో హాలీవుడ్ లో 'ది క్యూరియస్ కేసు ఆఫ్ బెంజిమెన్ బటన్' అనే సినిమా రిలీజైంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవటమే కాక ఆస్కార్ అవార్డ్ ను సైతం సంపాదించి పెట్టింది. బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఈ సినిమాలో పుట్టుకతోనే జన్యు లోపంతో ముసలి వాడిగా పుట్టిన ఓ వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ కుర్రాడు అవుతాడు. ఆ సినిమాని ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నామో తర్వాత చెప్తాను. మొదట 7 (సెవెన్) సినిమా గురించి మాట్లాడుకుందాం. 

హవీష్ రెండు సినిమాలు చేసినా అవేంటో ఎవరికీ గుర్తు లేదు..గుర్తు రావు. అలాంటి ఈ హీరో ఈ సారి ఆరుగురు హీరోయిన్స్ తో కలిసి ఓ సినిమా చేసాడు అంటే ఖచ్చితంగా అది ఇంట్రస్టింగ్ విషయమే.  ఆగండి...ఇదో ప్లే బోయ్ సినిమా అని కంక్లూజన్ కు వచ్చేయకండి. ఎందుకంటే ఇది ప్రేక్షకుడుని కొంత కన్ఫూజ్ చేస్తూ థ్రిల్ చేయాలని వచ్చిన ఓ థ్రిల్లర్ సినిమా. అయితే హీరో ప్లే బోయ్ కానప్పుడు అంత మంది హీరోయిన్స్ అవసరం ఏమొచ్చింది. ఈ సెవన్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమాతో అయినా హవీష్ అనే హీరో మనకు గుర్తుంటాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

స్టోరీ లైన్ విత్ సస్పెన్స్...

సినిమా ప్రారంభంలో వర్గం లో రమ్య( నందితా శ్వేతా) అనే అమ్మాయి హడావిడిగా పోలీస్ స్టేషన్ కు వస్తుంది. ఎందుకూ అంటే తన భర్త కార్తీక్‌ రఘునాథ్‌ (హవీష్) గత కొంతకాలంగా కనిపించటం లేదు. భర్తను వెతకటం కోసం అతనితో దిగిన ఫొటోలు ఇస్తుంది.  ఆమె కథ అంతా ఓపిగ్గా విన్న ఏసీపీ విజయ్‌ ప్రకాష్‌ (రెహమాన్‌) మొదట ఆశ్చర్యం ఆ తర్వాత షాక్‌ అవుతాడు. ఆమె జీవితంలో ఏం జరిగిందో ఊహిస్తాడు. ఎందుకు ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు కు అంతలా షాక్ అంటే...రమ్యను మోసం చేసినట్టుగానే కార్తీక్‌ గతంలో జెన్నీ(అనీషా ఆంబ్రోస్) అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆల్రెడీ కేసు నమోదు అయ్యి ఉంది. దీంతో ఆ  ఏసీపీ కు అర్దమవుతుంది.  ఈ రెండు కేసుల్లో ఉన్నవాడు ఒకడే. కావాలని కార్తీక్‌ వీళ్లను కావాలనే మోసం చేసి వెళ్లిపోయాడని. దాంతో చీటింగ్‌ కేసుగా మిస్సింగ్ కేసుని మార్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. 

అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయి ప్రియ (త్రిధా చౌదరి)ని కార్తీక్‌ పెళ్లి చేసుకుని జంప్ అని తెలుస్తుంది. దాంతో ఇది పెద్ద ఫ్రాడ్ కేసుని స్పష్టం అవుతుంది. ఇలా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న కార్తీక్ ని ఎలాగైనా పట్టుకోవాలి, మరికొంతమంది జీవితాలు కాపాడాలని సీరియస్ గా ఇన్విస్టిగేట్ చేస్తూంటే మరో విషయం బయిటపడి ..ఆ పోలీస్ అధికారి కు బుర్ర తిరిగిపోతుంది. కార్తీక్ ఎప్పుడో చాలా కాలం క్రితమే చనిపోయాడని, అయితే అతని పేరు కార్తీక్ కాదు కృష్ణ మూర్తి అని  ఓ వ్యక్తి  చెప్తాడు. దాంతో పోలీస్ కు మతి పోతుంది. ఎవరిని నమ్మాలి, ఏం నమ్మాలి..అసలేం జరుగుతోందో అర్దం కాదు. వాళ్లకు అసలు కార్తిక్ దొరికాడా..మధ్యలో ఈ కృష్ణమూర్తి ఎవరు...  ఆ అమ్మాయిలను ఎందుకు మోసం చేస్తున్నాడు? కార్తిక్ కు సరస్వతమ్మ (రెజీనా)కు ఉన్న రిలేషన్ ఏంటి? సినిమాలో అసలు ట్విస్ట్ ఏమిటనేది  మిగతా కథ.


అన్ని థ్రిల్లర్స్ ...థ్రిల్లింగ్ గా ఉండాలా? 
  
థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం కథ పేపరు మీద చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా తెరపైకు వచ్చే సరికి ఎంగేజ్ చేసే థ్రిల్లర్ అవుతుందనిపిస్తుంది. అయితే తెరమీదకు ఎక్కాలంటే ఖచ్చితంగా ఇలాంటి థ్రిల్లర్స్ కు బిగిసడలని కథనం అవసరం. అలాగే చిన్న చిన్న లూప్ హోల్స్ ని మనం పసిగట్టకుండా పరుగెత్తే రేసీ స్క్రీన్ ప్లే కూడా అత్యవసరం. ఆ రెండూ ఈ సినిమాకు లేవు. ఎక్కడా ఈ కథ నమ్మబుద్ది కాదు. సినిమాని మలుపు తిప్పే ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్టివ్ గా లేదు. క్లైమాక్స్ లో కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి కానీ వాటిని ఆస్వాదించే మూడ్ మనకు అప్పటికి పోతుంది. 

అయితే సినిమాకు పాజిటివ్ విషయం ఏదైనా ఉందీ అంటే అది సినిమాటోగ్రఫీనే. దర్శకుడు ,సినిమాటోగ్రాఫర్ ఒకరే కావటంలో ఆ యాంగిల్ లోనే సినిమాని బాగా తెరకెక్కించగలిగారు. కాకపోతే చాలా చోట్ల సీన్ సస్జెన్ చేయాల్సిన విషయాలను త్వరగా ముగించటం, త్వరగా ముగించాల్సిన వి సాగతీయటం చేసాడు. దాంతో రిజిస్టర్ అవ్వాల్సిన ఎలిమెంట్స్ మిస్సయ్యాయి. అక్కర్లేనివి నస పెట్టటం మొదలెట్టాయి.

ఎవరెలా..

నటుడుగా హవీష్ తన గత చిత్రాలు కన్నా బెటర్ కానీ బెస్ట్ మాత్రం కాదు. రెజీనాకు చెప్పుకోదగ్గ పాత్ర లేదు. మిగతా హీరోయిన్స్ బాగానే చేసారు. అయితే వీళ్లందరినీ గుర్తుపెట్టుకునేటంత పాత్రలు కావు. రహమాన్ గతంలో తమిళంలో ఇలాంటి ఇన్విస్టిగేటివ్  పోలీస్ పాత్రను చేస్తూ "16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్" టైటిల్ తో  సినిమా చేసారు. ఆ సినిమా సూపర్ హిట్. అందుకే ఈ సినిమాలోనూ అచ్చం అలాగే చేయించినట్లున్నారు. తమిళ మార్కెట్ కు రహమాన్ ఉపయోగపడచ్చు. 

మిగతావాళ్లలో చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించింది జోష్ రవి. సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రనే చేసిన రవి లో నటుడు ని పూర్తిగా ఆవిష్కరించిన సినిమా ఇది. 

టెక్నికల్ గా...

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ చింతన్ భరద్వాజ్ ఇంతనాసిరకం పాటలు ఇస్తారనుకోం. అయితే థ్రిల్లర్ జానర్ కు తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.  ఎడిటింగ్ లో బాగా లాగ్ లు ఉన్నాయి. షార్ప్ కట్ ఇలాంటి థ్రిల్లర్స్ బాగా అవసరం.  ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్బుతం కాదు కానీ ఓకే.   డైరక్టర్ గా నిజార్‌ షఫి ...మరింత మంచి లాజిక్ లు ఉన్న కథ దొరికితే బాగా తీయగలుగుతాడని అర్దం అవుతుంది. అలాగే సినిమా అంటే కేవలం సీన్స్ పేర్చుకుంటూ వెళ్లటమే కాకుండా ఎమోషన్స్ ని ఆ సీన్స్ లోంచి రప్పించగలగాలని గుర్తిస్తే చాలు. 


ఫైనల్ థాట్


ఈ రివ్యూ ప్రారంభంలో చెప్పిన   'ది క్యూరియస్ కేసు ఆఫ్ బెంజిమెన్ బటన్' కు ఈ సినిమాకు ఓ కీలకమైన లింకే ఉంది. అదేంటో చెప్పేస్తే ...సినిమా చూద్దామని వెళ్దామనుకునే వాళ్లకు ఆ థ్రిల్ మిస్సవుతుంది ..కాబట్టి..ఇప్పటికి ఇంతే. అర్దం చేసుకోగలిగితే అంతే.

 Rating: 2.0/5

ఎవరెవరు

నిర్మాణ సంస్థ‌లు: కిర‌ణ స్టూడియోస్‌, ర‌మేష్ వ‌ర్మ ప్రొడ‌క్ష‌న్
న‌టీన‌టులు: హ‌వీష్‌, రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ, ర‌హ‌మాన్‌, సుంక‌ర ల‌క్ష్మి, పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ
లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్,
డైలాగ్స్: జీఆర్ మహర్షి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ
స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ
సినిమాటోగ్రఫీ - దర్శకత్వం: నిజార్ షఫీ.

Follow Us:
Download App:
  • android
  • ios