ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద భైరవగీత, హుషారు వంటి సినిమాలతో పాటు మోహన్ లాల్ 'ఒడియన్' సినిమా కూడా విడుదలవుతోంది. మలయాళంలో రూపొందిన ఈ సినిమాను డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా వంద కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. పర్టిక్యులర్ గా తెలుగులో రూ.5 కోట్లు పెట్టి థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమాతో మోహన్ లాల్ కి మంచి క్రేజ్ వచ్చింది. అతడు నటించిన 'మన్యంపులి' సినిమా ఇక్కడ రైట్స్ తీసుకున్న నిర్మాతలకు రూ.6 కోట్లు తెచ్చిపెట్టింది.

అయితే అప్పుడు ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ కోటిన్నరకి అమ్మడంతో తెలుగులో విడుదల చేసిన నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చింది. కానీ 'ఒడియన్' సినిమా తెలుగు రైట్స్ కోసం ఐదు కోట్లు వెచ్చించడం హాట్ టాపిక్ గా మారింది. 

వారం రోజుల్లో ఇంత మొత్తాన్ని రాబట్టడం అంత సులువు కాలేదు. వచ్చే వారంలో 'అంతరిక్షం', 'పడి పడి లేచే మనసు', 'కెజిఎఫ్' వంటి సినిమాలు బరిలో ఉన్నాయి. కాబట్టి ఎంత వసూలు చేయాలన్నా వారం మాత్రమే సమయం ఉండడంతో ఇది రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని అంటున్నారు.