సాధారణంగా పెద్ద దర్శకుల సినిమాలు స్టార్ హీరోల సినిమాలు బడ్జెట్ కారణాల వల్ల వాయిదా పడటం అనేది ఈ రోజుల్లో నమ్మలేని విషయం. అసలు వారి కోసం ఎంత మంది నిర్మాతలు క్యూలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్నిసార్లు కాలం కలిసిరాకపోతే ఎంత స్టార్ సెలబ్రెటీ సినిమా అయినా కూడా క్యాన్సిల్ అవ్వాల్సిందే. 

సంచలన దర్శకుడు శంకర్ కి ఇలాంటి అనుభవం రెండు సార్లు ఎదురైంది. అదికూడా రోబో సినిమాలకు సంబందించిన విషయంలోనే కావడం విశేషం. రోబో చిత్రానికి అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వగా ఇప్పుడు ఆ సీక్వెల్ కథ అయిన 2.ఓ కు గ్రాఫిక్స్ నుంచి ఎఫెక్ట్ పడింది. అసలు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత అనే విషయంలో జనాలకు ఒక క్లారిటీ రావడం లేదు. 

మొదలుపెట్టినప్పుడు 300 కోట్లని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక ఆ తరువాత గ్రాఫిక్స్ వర్క్స్ ఆలస్యం వల్ల మరో 100 కోట్లు పెరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కొందరు 550కోట్లని కూడా అంటున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. 

నిజానికి 2.ఓ బడ్జెట్ తక్కువేమి కాదు. అయితే చిత్రానికి 550కోట్లను ఖర్చు చేశారనేది వాస్తవం కాదని అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ మధ్యలో చేతులెత్తేయడం వలన సినిమా బడ్జెట్ పెరిగింది. రెండోసారి పని చేయించడంతో 400కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఈ స్థాయిలో చిత్రం రికవర్ చేస్తుందా అంటే.. ఆ కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెబుతున్నారు. 

ఎందుకంటే సౌత్ లో రజినీకాంత్ హవా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నార్త్ లో ఆయన కు క్రేజ్ అంతగా లేకపోయినప్పటికీ అక్షయ్ కుమార్ ఉన్నాడు గనక కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా శాటిలైట్ రైట్స్ 80కోట్లకు అమ్ముడుపోవడంతో సినిమా దాదాపు త్వరగానే బడ్జెట్ ను రికవర్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.