దర్శకుడు గుణశేఖర్ 'హిరణ్య' అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని రూపొందించనున్నాడు. గత రెండేళ్లుగా ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెడతారు.

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించబోయే ఈ సినిమాని నిర్మాత సురేష్ బాబు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.200 నుండి 250 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే కొడుకుపై ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సురేష్ బాబుకి ధైర్యం చాలడం లేదట. ఇంతటి భారీ మొత్తంతో సినిమా చేస్తే.. తిరిగి రానా ఎంత రాబదతాడనే ప్రశ్న ఆయన్ని వెంటాడుతోంది. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు బడ్జెట్ రిస్క్ ని అధిగమించడానికి ఓ ప్లాన్ చేశాడు సురేష్ బాబు.

అదేంటంటే.. 20th ఫాక్స్ స్టూడియోచేతుల్లో ఈ ప్రాజెక్ట్ ని పెట్టినట్లు సమాచారం. ప్రొడక్షన్ మొత్తం సురేష్ బాబు చూసుకునేలా.. మొత్తం పెట్టుబడిలో కొంత భాగం ఫాక్స్ స్టూడియో పెట్టేలా ఒప్పందాలు జరిగాయని సమాచారం. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.