రజినీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు.. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘన విజయాన్ని సాధించిన 'రోబో' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ '2.0' సినిమా కోసం రెండేళ్లుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సినిమాపై ఆసక్తిని తగ్గించేసింది చిత్రబృందం.

కానీ ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది నవంబర్ 29న సినిమా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు శంకర్ వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదలలో ఆలస్యం జరిగిందని ఎప్పటిలానే రెగ్యులర్ రీజన్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తోన్న కంపనీ అవుట్ పుట్ ఇచ్చే డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో శంకర్ రిలీజ్ డేట్ చెప్పేశాడు.

నిజానికి ఈ సినిమా గ్రాఫిక్స్ ముందు మరో కంపనీ డీల్ చేసింది. కానీ శంకర్ సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ మరో కంపనీతో మొత్తం వర్క్ చేయించుకున్నాడు. ఆ కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పి క్లారిటీ ఇచ్చేశాడు. అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.