సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఇది మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఎలా జరుగుతోందనేది అంతటా మాట్లాడుకునే అంశం గా మారింది. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకు బిజినెస్ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని భావిస్తారు.

అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బడ్జెట్ తగినట్లుగా బిజినెస్ చేయటం దిల్ రాజు లాంటి నిర్మతకే కష్టంగా మారిందంటున్నారు. దిల్ రాజు 18 కోట్లు దాకా ఓవర్ సీస్ రైట్స్ చెప్పారని...శ్రీమంతుడు చిత్రం మించి ఆడుతుందని , కంటెంట్ అలాంటిదని చెప్తున్నారుట. అయితే అంత రేటు పెట్టలేమంటున్నారట బయ్యర్లు. ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ దాకా ముందుకు వచ్చి 12 నుంచి 13 కోట్లు దాకా పెట్టగలమని చెప్పారని, భారీ ఎత్తున రిలీజ్ చేస్తామంటున్నారని, అయితే దిల్ రాజు..మాత్రం అంత తక్కువకు ఇచ్చేది లేదని చెప్పినట్లుగా చెప్పుకుంటున్నారు. 

చాలా కాలం పాటు ఓవర్ సీస్ లో కింగ్ గా వెలుగుతున్న మహేష్ కు గత కొద్ది కాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు డిజాస్టర్స్ ఆయన్ను వెంటాడుతున్నాయి. దాంతో భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ రావటం కష్టంగా మారింది. దాంతో ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆ రేట్లకు పెద్దగా ఉత్సాహం చూపించటంలేదని వినికిడి. డబ్బులు బాగానే వస్తున్నా ఎక్కువ రేట్లకు తీసుకోవటంతో లాభాలు ఏమీ మిగలటం లేదని ధైర్యం చేయటం లేదు.

మహేష్ కు శ్రీమంతుడు చిత్రమే ఓవర్ సీస్ లో ఈ మధ్యన కాస్త ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కూడా రైతుల సమస్యలు సెకండాఫ్ లో టచ్ చేస్తున్నారు కాబట్టి అలాగే ఆడుతుందని 18 కోట్లు దాకా ఓవర్ సీస్ రైట్స్ చెప్తున్నారు. దాంతో బయ్యర్లు ..ఏమన్నా రేట్లు తగ్గిస్తారేమో ఎదురు చూస్తున్నారుని చెప్పుకుంటున్నారు. 

‘దిల్‌’ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘ఈ కథ కోసం వంశీ రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమా బాగా వచ్చింది. యూనిట్‌ అంతా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. అశ్వినీదత్‌గారు, నేను, పివీపీగారు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.

మహేశ్‌ గారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా ‘మహర్షి’ నిలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్‌లో ‘ఎఫ్‌2’ తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాం. ఈ సమ్మర్‌కి కూడా ‘మహర్షి’తో బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. ‘ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు’ సినిమాల తరహాలో ఈ సినిమాలో నావల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మన వంతుగా ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో వస్తాడు’’ అన్నారు. 

సెకండాఫ్ లో అల్లరి నరేష్ పాత్ర హై లైట్ అవ్వనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు.మోహనన్‌.