ఈ సోషల్ మీడియా రోజుల్లో సినిమా కథ గాని, పోస్టర్స్ కానీ వేరే వారికి చెందిన వర్క్ కు సంభందించి ఏ మాత్రం పోలికలు కనపడినా కాపీ అనేస్తున్నారు. వివాదాలు మొదలైపోతున్నాయి. అయితే ఇన్నాళ్లూ మనకు కేవలం కథలకు సంభందిన వివాదాలే ఎక్కువ నడిచాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్  పోస్టర్స్  సైతం కాపీ అంటూ,, ఇదిగో ఒరిజనల్ అంటూ వివాదానికి అగ్గి  రాజేస్తున్నారు. విజయ్ దేవరకొండ తాజా చిత్రానికి ఇప్పుడు అలాంటి సమస్యే ఎదురౌతోంది.

వివరాల్లోకి వెళితే..స్టార్ హీరో  విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ  సినిమా ఫస్ట్‌లుక్  రీసెంట్ గానే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. చేతిలో సిగరెట్ పట్టుకుని ముఖం నిండా రక్తంతో కారుతున్న దెబ్బలతో  కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న విజయ్ లుక్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.

కాకపోతే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కాస్త అర్జున్ రెడ్డి పోస్టర్‌ను గుర్తు చేస్తోందని విమర్శలు వచ్చాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దాన్ని కొట్టిపారేసారు. అయితే తాజాగా మరో వివాదం మొదలైంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ 2015 జనవరిలో టెక్సాస్ కు చెందిన ఓ పాపులర్ ఫొటో గ్రాఫర్  Lauren Withrow తీసిన ఫొటో షూట్ ని గుర్తు చేస్తోందంటున్నారు. రెండూ దాదాపు ఒకేలా ఉండటం విశేషం. అయితే అలాంటి అలాచన ఈ దర్శకుడు కూడా వచ్చి ఉండవచ్చు అని కొందరు వాదిస్తున్నారు.
 
‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ హీరోయిన్స్ . క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్‌ రామారావు సమర్పిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు.