సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో ఇటీవల పెద్ద హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్ లో జరిగింది.

తాజాగా రెండో షెడ్యూల్ మొదలైందని నిర్మాతలు తెలిపారు. ఈ షెడ్యూల్ లో రైలు సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నారని.. ఈ ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని పేర్కొన్నారు. ట్రైన్ ఎపిసోడ్ లోనే హీరోయిన్ రష్మికతో మహేష్ లవ్ స్టోరీ మొదలవుతుందని సమాచారం.

ఆయన కాశ్మీర్ నుండి కర్నూలులో ఉన్న తన ఇంటికి ప్రయాణిస్తుండగా.. రష్మిక, ఆమె కుటుంబంతో పరిచయం ఏర్పడుతుందని చెబుతున్నారు. 'లాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైలులో సంక్రాంతికి మిమ్మల్ని చేరుకోవడానికి వేగంగా వస్తోంది. అనిల్‌ రావిపూడితో కలిసి సూపర్‌స్టార్‌ తెరపై సందడి చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి' అని నిర్మాత అనిల్‌ సుంకర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సినిమాలో ఈ ట్రైన్ ఎపిసోడ్ హిలారియస్ గా ఉంటుందని దర్శకుడు అనీల్ రావిపూడి పేర్కొన్నారు. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం  జరుగుతోంది.