రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్సీ నగర్ లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల రాఘవ లారెన్స్ తెరకెక్కించిన 'కాంచన 3' సినిమాలో కూడా ఈమె నటించింది.

అయితే బుధవారం నాడు ఆమె తనపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని పోలీసులను ఆశ్రయించింది. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. 

తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రుబేశ్ పలు భంగిమల్లో ఫోటోలు తీసినట్లు ఆమె చెప్పింది. ఆ తరువాత ఆ ఫోటోలను వాట్సాప్ చేసి.. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెప్పింది. తన కోరిక తీర్చకపోతే ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాధవరం, పొన్నియమ్మన్ మేడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.